ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీన్ రివర్స్ అయినట్టే కనిపిస్తోంది. 2014 తర్వాత.. వల వేసి మరీ పట్టుకున్నట్టుగా.. టీడీపీ నేతలు చేరికలను ప్రోత్సహించారు. తమ పార్టీలోకి ఇతర పార్టీల నేతలను ఆహ్వానించారు. ఆపరేషన్ ఆకర్ష్ అన్నట్టుగా వ్యవహరించి.. తమ పార్టీని బలోపేతం చేసుకోవడంపైనే ఎక్కువ కాలం గడిపేశారు. అందులో.. ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు కూడా భాగమయ్యారు. వచ్చిన వారికి వచ్చినట్టు పచ్చ కండువాలు వేసి తమలో కలిపేసుకున్నారు.
ఆ తర్వాత.. రెండేళ్ల నుంచి అసలు కథ మొదలయ్యింది. బాబుగారు ఆశించినట్టుగా అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు సాధ్యం కాలేదు. దీంతో.. టికెట్లు దొరుకుతాయో లేదో అన్న ఆందోళన చాలా మంది నేతల్లో పెరుగుతోంది. మరోవైపు.. బయట ఇంకా మిగిలిన ముఖ్య నాయకులు కూడా.. టీడీపీలో చేరికలపై ఆలోచనలో పడుతున్నారు. ఇలాంటి వారి జాబితాలో.. ఇప్పుడు కృష్ణా జిల్లాకు చెందిన ఓ నేత కూడా చేరిపోయారు.
మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు కృష్ణ ప్రసాద్.. వైసీపీ అధినేత జగన్ వెంటే నడవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. తన ఆలోచనలో మార్పు లేదని కూడా స్పష్టం చేశారు. తనను ముఖ్యమంత్రి పిలిపించి.. గుంటూరు టికెట్ ఇస్తానని చెప్పినట్టు వివరించారు. కానీ.. తనకు కృష్ణా జిల్లా వీడే ఉద్దేశం లేదని.. గుంటూరుకు వెళ్లే ఆసక్తి లేదని తేల్చి చెప్పారు.
గత ఎన్నికల్లో టీడీపీ తరఫున నిలబడిన అభ్యర్థుల విజయానికి.. పెద్దల ఆజ్ఞతో కృషి చేశానని గుర్తు చేసుకున్న కృష్ణ ప్రసాద్.. ఇప్పుడు మాత్రం తాను పూర్తిగా వైసీపీకే పని చేస్తానని అంటున్నారు. పైగా.. తనకు టీడీపీలో సభ్యత్వమే లేదని.. అలాంటపుడు రాజీనామా అన్న ప్రసక్తి కూడా రాదని చెబుతున్నారు. దీంతో.. టీడీపీ నేతలు ఇరకాటంలో పడ్డారు.