తెలంగాణలో ఉద్యోగ ఉపాధ్యాయ బదిలీలకు మార్గదర్శకాలు సిద్ధమయ్యాయి. అజయ్ మిశ్రా కమిటీ సిఫార్సుల ఫైల్ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు చేరింది. పైరవీలకు ఆస్కారం లేకుండా వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని కమిటీ సూచించింది. బదిలీలకు నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి 10రోజుల్లోపే ప్రక్రియ పూర్తి చేయాలని కమిటీ సిఫార్సు చేసింది.
ఉద్యోగ ఉపాధ్యాయ బదిలీలకు రంగంసిద్ధమైంది. మార్గదర్శకాలు రూపొందించేందుకు నియమించిన అజయ్ మిశ్రా కమిటీ.... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక సమర్పించింది. పారదర్శకంగా బదిలీలు చేపట్టేందుకు వీలుగా వివరణాత్మక బదిలీ పాలసీని కమిటీ సిఫార్సు చేసింది. ఏ ఉద్యోగి అయినా... కనీసం రెండేళ్లు దాటితేనే బదిలీకి అవకాశం ఇవ్వాలని సూచించింది. అయితే ఆర్డర్ టూ సర్వ్ ఉద్యోగులకు రెండేళ్ల కాలపరిమితి నిబంధన వర్తించదని తెలిపింది. అలాగే ఒకేచోట ఐదేళ్లుగా పనిచేస్తున్నవారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని సిఫార్సు చేసింది. 20శాతం మందినే బదిలీ చేయాలన్న నిబంధనను తొలగించిన కమిటీ.... కనీసం 40శాతం బదిలీలు చేపట్టాలని అభిప్రాయపడింది.
ముందుగా స్పౌజ్ కోటా బదిలీలు చేపట్టాలని చెప్పింది. అయితే బదిలీల్లో పారదర‌్శకత కోసం ఉద్యోగుల వివరాలను ఆన్‌లైన్‌లో లేదా నోటీస్ బోర్డు పెట్టాలని, అలాగే వివిధ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించింది. విద్యా, అటవీ, రెవెన్యూ, రవాణా, పోలీస్ శాఖల్లో బదిలీలకు ప్రత్యేక మార్గదర‌్శకాలు అవసరమని కమిటీ అభిప్రాయపడింది. దీర్థకాలం మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్నవారికి, మెంటల్ రిటార్డెడ్ పిల్లలున్నవారికి బదిలీల్లో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. అలాగే అనారోగ్యంతో ఇబ్బంది పడుతోన్న ఉద్యోగులకు కూడా బదిలీల్లో అవకాశం కల్పించాలని కమిటీ సిఫార్సు చేసింది. ఇక బదిలీ ఉత్తర్వులు అందిన మూడ్రోజుల్లోపే రిలీవ్ చేయాలని, లేకపోతే రిలీవ్ చేసినట్టుగానే భావించాలని కమిటీ సిఫార్సు చేసింది.
ఉద్యోగ ఉపాధ్యాయ బదిలీలపై అజయ్ మిశ్రా సిఫార్సులకు ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేయగానే... బదిలీల ప్రక్రియ చేపట్టేందుకు ఆర్ధికశాఖ ఉత్తర్వులు ఇవ్వనుంది. జూన్ ఫస్ట్‌వీక్‌లోనే ప్రక్రియ మొదలుకానున్నట్లు తెలుస్తోంది.