కాంగ్రెస్ పెద్ద‌ల‌తో భేటీ కానున్న చంద్ర‌బాబు

Update: 2018-04-02 23:17 GMT

ఏపీకి ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపిస్తూ ఎన్డీఏ నుండి టిడిపి బయటకు వచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై ప్రస్తుతం అధికార టిడిపి, విపక్ష వైసీపీలు పోటాపోటీగా పోరాటాలు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సీఎం చంద్ర‌బాబు హ‌స్తిన బాట ప‌ట్టారు.  ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగానే  చంద్రబాబునాయుడు  ఢిల్లీ ప‌ర్య‌ట‌న చేస్తున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో పార్లమెంట్ సెంట్రల్ హల్‌లో అవిశ్వాసానికి మద్దతిచ్చిన ఆయా రాజకీయ పార్టీల పార్లమెంటరీ పార్టీల నేతలతో చంద్రబాబునాయుడు సమావేశం కానున్నారు. ప్రత్యేకహోదాకు మద్దతిచ్చినందుకు ఆయా పార్టీల నేతలకు ధన్యవాదాలు తెలపనున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హల్ లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత మల్లిఖార్జున ఖర్గేతో కూడ చంద్రబాబునాయుడు సమావేశం కానున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అంతేకాదు బీజేపీయేత‌ర  పార్టీలతో చంద్రబాబునాయుడు కూటమిని కూడ ఏర్పాటు చేసే అవకాశాలు కూడ కొట్టిపారేయలేమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే రాజకీయ పరిణామాల్లో శరవేగంగా మార్పులు చోటు చేసుకొనే అవకాశాలు లేకపోలేదన్నారు.  
కాగా ఢిల్లీ ప‌ర్య‌ట‌నకు ముందు చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్ర‌ధానంగా ఏపీకి ప్ర‌త్యేక‌హోదా అంశంపై చ‌ర్చించిన‌ట్లు మంత్రిసోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి చెప్ప‌రు. మిత్రపక్షాలను తొక్కేసి శత్రుపక్షాలతో మోడీ చేతులు కలుపుతున్నారని టీడీఎల్పీ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని అన్ని పార్టీల నేతలకు చెప్పాలని టీడీపీ నేతలు బాబు దృష్టికి తీసుకొచ్చారు.  విభజనకు కారణమైన కాంగ్రెస్‌ను కలవడం సరికాదని పలువురు ఎమ్మెల్యేలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అవిశ్వాసానికి మద్దతు ఇచ్చిన అందరినీ కలిసి కృతజ్ఞతలు చెప్పాలని మరికొంతమంది ఎమ్మెల్యేలు చంద్రబాబుకు సూచించారు.
 

Similar News