అత్యంత ధనవంతుల జాబితా మాదిరిగానే ఈఏడాది కూడా అత్యంత ధనిక పార్టీల లిస్టు కూడా వచ్చేసింది. దేశంలోని జాతీయ పార్టీల్లో అత్యంత ధనిక పార్టీగా బీజేపీ ఆవిర్భవించింది. అధికార పార్టీకి మాములుగానే అత్యధికంగా విరాళాల రూపంలో వస్తుంటాయి. నాలుగేళ్లలో బీజేపీ వెయ్యికోట్లకు పైగా ఆస్తులు సంపాదించి రిచెస్ట్ పార్టీగా నిలిచింది.
బీజేపీ ఇప్పుడు దేశంలోనే రిచెస్ట్ పార్టీ ఏది అంటే బీజేపీ అనే చెప్పాలి. అవును అధికారంలోకి వచ్చాక వరుసగా మూడో ఏడాది బీజేపీ ధనిక పార్టీగా అవతరించింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో జాతీయ పార్టీల్లో అత్యంత ధనిక పార్టీగా బీజేపీ నిలిచింది. ఆ ఏడాది బీజేపీకి మొత్తం రూ. 1,034.27 కోట్ల ఆదాయం లభించింది. 2016–17లో ఏడు జాతీయ పార్టీల మొత్తం ఆదాయం రూ.1,559.17 కోట్లు కాగా అందులో బీజేపీ వాటా 66.34%. అంతకుముందటి సంవత్సరంతో పోలిస్తే బీజేపీ ఆదాయం 2016–17లో ఏకంగా 81.18 శాతం పెరిగింది.
2015–16లో ఆ పార్టీకి వచ్చిన ఆదాయం రూ.570.86 కోట్లే. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, తృణమూల్ కాంగ్రెస్, బీఎస్పీ, ఎన్సీపీలు దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్నుల వివరాలను విశ్లేషించిన అసోసియే షన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. పార్టీల ఆదాయాల్లో దాదాపు 75 శాతం నిధులు స్వచ్ఛంద విరాళాల ద్వారా వచ్చినవే.
ఇక అతి తక్కువ ఆదాయం పొందిన పార్టీగా సీపీఐ నిలిచింది. సీపీఐకి 2016–17లో వచ్చిన ఆదాయం రూ. 2.08 కోట్లు. రూ. 225.36 కోట్ల ఆదాయం పొందిన కాంగ్రెస్ రెండో ధనిక పార్టీగా నిలిచింది. 2016–17లో ఏడు పార్టీలు కలిపి చేసిన మొత్తం వ్యయం రూ.1,228.26 కోట్లు కాగా, ఇందులో బీజేపీ వాటా రూ.710.05 కోట్లు.