టీడీపీ - బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. రాష్ట్రానికి మీరేం చేశారంటే మీరేం చేశారని ఒకరికొకరు ప్రశ్నించుకుంటూ రాజకీయ మంటను రగలిస్తున్నారు. అంతేకాదు బీజేపీ చేసిన ఘనకార్యం వల్లే పొత్తునుండి విడిపోయామని టీడీపీ అంటుంటే అందుకు కౌంటర్ గా రాష్ట్రానికి తాము ఏం చేసిందో చెప్పే ప్రయత్నం చేస్తుంది బీజేపీ.
ఈ నేపథ్యంలో టీడీపీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. ఏపీకి ప్రత్యేకహోదా, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై సహకరించనందున ఎన్డీఏ తో తెగదెంపులు చేసుకున్నట్లు సీఎం చంద్రబాబు ఓ లేఖ రాశారు.
ఎక్కడా విమర్శ లేకుండా తాము చేసిన వాటిని మాత్రమే లేఖలో చేర్చారు. టీడీపీకి, ఏపీ ప్రజలకు ఎప్పటికీ బీజేపీ నమ్మదగిన నేస్తమేనన్నారు.
ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వస్తూ చంద్రబాబు రాసిన లేఖకు అమిత్ షా సమాధానం ఇచ్చారు. పూర్తిగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. రాజకీయ అవసరాల కోసమే ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యం కలిగించిందంటూ 9 పేజీల లేఖలో ప్రస్తావించారు.
అభివృద్ధి కంటే రాజకీయ పరమైన అంశాల కారణంగానే బయటకు వెళ్లినట్లు అనిపిస్తోందని లేఖలో వెల్లడించారు. ఏపీకి సంబంధించి ఏ చిన్న విషయంలోనూ కేంద్రం వెనుకడుగు వేయలేదన్నారు. ఏపీ అభివృద్ధికి మోడీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందించిందన్నారు. గతంలో టీడీపీకి లోక్ సభలో, రాజ్యసభలో సరైన ప్రాతినిధ్యం లేనప్పుడు బీజేపీ అజెండా తయారు చేసిందన్నారు.
గతంలో టీడీపీకు లోక్‌సభలోగానీ, రాజ్యసభలోగానీ సరైన ప్రాతినిధ్యం లేనప్పుడు బీజేపీనే అజెండా తయారుచేసిందని గుర్తుచేశారు. బీజేపీనే ఏపీ తరఫున వాదనలు వినిపించిందని చెప్పారు. ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం పూర్తిస్థాయిలో నెరవేర్చిందని వెల్లడించారు.
ఏపీకి ఇచ్చిన కేంద్ర విద్యాసంస్థలు, ఎయిమ్స్, ఇతరత్రా అంశాలు, విభజనచట్టంలోని అంశాలను అమిత్‌షా లేఖలో ప్రస్తావించారు. మూడు ఎయిర్‌పోర్టులను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా మార్చినట్లు పేర్కొన్నారు. అమరావతిలో రైల్‌రోడ్ నిర్మాణానికి, 180 కి.మీ రింగ్‌రోడ్డుకు నిధుల విషయాన్ని ప్రస్తావించారు. కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి నిధులు కేటాయించినట్లు చెప్పారు. మెట్రో రైలు ప్రాజెక్టుకు సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్లు పేర్కొన్నారు. లేఖ చూసిన తర్వాత ఇప్పటికీ టీడీపీతో స్నేహం కోసం బీజేపీ వెయిట్ చేస్తోందేమో అనిపించేలా ఉంది.