వరుస ఆందోళనలతో లోక్‌సభను స్తంభింపచేస్తూ అవిశ్వాసంపై చర్చ జరగకుండా అడ్డుకుంటున్న అన్నాడీఎంకే నుంచి మోడీ సర్కారుకు ఊహించని షాకిచ్చింది. కావేరి బోర్డు ఏర్పాటు డిమాండ్‌పై కేంద్రం స్పందించకపోతే తాము కూడా అవిశ్వాసానికి సిద్ధమంటూ అన్నాడీఎంకే ప్రకటించింది. కావేరి మేనేజ్‌మెంట్ బోర్డుపై కేంద్రం తేల్చకపోతే అవిశ్వాసం పెట్టడమో లేదంటే ఇతరులు పెట్టిన అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడమో నిర్ణయిస్తామని లోక్‌సభ డిప్యూటీ స్పీకర్, ఏఐఏడీఎంకే ఎంపీ తంబిదురై తెలిపారు.
కేంద్రం మరింత ఒత్తిడి పెంచేందుకు అన్నాడీఎంకే ఎంపీ ముత్తుకరుప్పన్ రాజీనామానాస్త్రం వదిలారు. కావేరి బోర్డు ఏర్పాటు చేయాలంటూ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ముత్తుకరుప్పన్ రాజీనామాతో కేంద్రంపై ఒత్తిడి పెరిగినట్లయ్యింది. ఒకవైపు కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ అవిశ్వాస తీర్మానాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న మోడీ సర్కార్ మరోవైపు అన్నాడీఎంకే ఒత్తిడితో సతమతమవుతోంది.