Strengthening Agriculture markets in AP: ఇక మార్కెటింగ్ బలోపేతం.. రూ. 4వేల కోట్లు కేటాయింపు

Strengthening Agriculture markets in AP: వ్యవసాయం దండగ నుంచి పండగకు తీసుకొచ్చిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి రైతులకు ఏటా భరోసా..

Update: 2020-07-24 02:30 GMT
Agriculture Markets in AP

Strengthening Agriculture markets in AP: వ్యవసాయం దండగ నుంచి పండగకు తీసుకొచ్చిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి రైతులకు ఏటా భరోసా కింద కొంత సాయం అందింస్తున్నారు. దీంతో పాటు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి, వారికి కావాల్సిన మౌలిక ఏర్పాట్లతో పాటు మరిన్ని అవసరాలకు తీర్చేందుకు చర్యలు తీసుకున్నారు. తాజాగా రైతులు పండించిన పంటలకు మార్కెటింగ్ బలోపేతం చేస్తే వారికి మరింత సౌలభ్యం అవుతుందని భావించిన ఆయన ప్రతి మండలంలో కొన్ని అదనపు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిధులు మంజూరు చేశారు. ఏపీవ్యాప్తంగా చూస్తే రూ. 4వేల కోట్లతో వీటిని ఏర్పాటు చేసేందుకు సంకల్పించారు.

రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని.. రూ. 4 వేల కోట్లతో వ్యవసాయ మార్కెటింగ్‌ను బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రతీ మండలానికి ఒక కోల్డ్ స్టోరేజీ నిర్మిస్తామని పేర్కొన్నారు. వ్యవసాయ గోడౌన్లు, కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణంపై ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. రైతు తన పంటను అమ్ముకునేలా మార్కెటింగ్‌ శాఖ తోడ్పాటు అందించాలని.. కనీస గిట్టుబాటు ధర రాని పక్షంలో ధరల స్థిరీకరణ నిధితో ఆదుకోవాలని సూచించారు. ''ప్రతి రైతు భరోసా కేంద్రం(ఆర్బీకే) పరిధిలో గోదాంలు, గ్రేడింగ్‌, సార్టింగ్ యంత్ర పరికరాలు ఉంటాయి. తన వద్ద పలానా పంట ఉందని రైతు ఆర్బీకేకు సమాచారం ఇస్తాడు..ఆ సమాచారం ఆధారంగా నేరుగా సెంట్రల్ సర్వర్‌కు చేరాలి. సెప్టెంబర్ నెలకల్లా ఇందుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ రూపొందించాలి'' అని అధికారులను ఆదేశించారు.

రైతులు తమ ఉత్పత్తుల వివరాలను ఆర్‌బీకేలలో అందివ్వగానే, ఆ పంటలకు ఎక్కడెక్కడ డిమాండ్‌ ఉందన్న సమాచారం, వ్యాపారుల వివరాలు వెంటనే తెలుగు భాషలో తెలియజేసేలా సదుపాయం ఉంటుందని అధికారులు చెప్పారు. ఇందు వల్ల రైతుల ఉత్పత్తులకు తగిన గిట్టుబాటు ధర వస్తుందని వివరించారు.

► సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, మార్కెటింగ్, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

► రైతులు తమ పంటలకు సంబంధించిన సమాచారాన్ని ఆర్‌బీకేలలో అందిస్తారు. అక్కడ నుంచి ఆ సమాచారం సెంట్రల్‌ సర్వర్‌కు చేరుతుంది. ఈ సమాచారాన్ని అందుకోగానే రైతుల పంట కొనుగోలు జరిగేలా చూడాలి.

► కనీస గిట్టుబాటు ధరకన్నా, తక్కువకు అమ్ముకునే పరిస్థితులు ఉంటే ధరల స్థిరీకరణ ద్వారా ఆదుకోవాలి.

► ఈ మొత్తం ప్రక్రియ సాఫీగా సాగడానికి ప్రత్యేకంగా ఒక సాఫ్ట్‌వేర్‌ను సెప్టెంబర్‌ నాటికి తయారు చేయాలి. ఖరీఫ్‌ పంట చేతికి వచ్చే నాటికి పూర్తిగా అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలి.

Tags:    

Similar News