ఆ ఇసుకంతా ఏమైంది.. ఏపీ ప్రభుత్వానికి పవన్ సూటి ప్రశ్న
ఏపీ ప్రభుత్వంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి విమర్శలు గుప్పించారు.
ఏపీ ప్రభుత్వంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి విమర్శలు గుప్పించారు.ఇసుక విధానంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలనే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వమూ చేస్తోందని పవన్ మండిపడ్డారు. భవన నిర్మాణ కార్మికులతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి 13 జిల్లాల నుంచి 150 మంది భవన నిర్మాణ కార్మికులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలికి స్వయం ప్రతిపత్తి కల్పించాలని పవన్ డిమాండ్ చేశారు. ఇసుక సరఫరాను సులభతరం చేసి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఇసుక మాఫియాను అదుపు చేయకపోతే నిర్మాణాలు కుదేలవుతుందని, ఇసుక ధరలతో మధ్యతరగతి ప్రజలు గృహ నిర్మాణం అంటే భయపడి వెనక్కి తగ్గుతున్నారని అన్నారు. లాక్ డౌన్ సమయంలోనూ.. లారీలు వేలాదిగా తిరిగాయని, ఇసుక మాత్రం డంపింగ్ ప్రదేశాలకు చేరలేదన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి నిధులను ఇతర ప్రయోజనాల కోసం దారిమళ్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇసుక కొరత, కరోనా వైరస్ వల్ల పనులు కార్మికులు అల్లాడిపోతున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు నిర్మించుకొంటున్న వారు, నిర్మాణాలు చేపట్టినవారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి సెస్ చెల్లిస్తారని, ఆ నిధులు ఉన్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలికి స్వయం ప్రతిపత్తి కల్పించాలన్నారు.