House Site Pattas: ఏపీ ప్రభుత్వానికి ఇళ్ల పట్టాల విషయంలో మరో షాక్ తగిలింది. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలకు సంబంధించిన స్థలాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ జిల్లా అనంతగిరి మండలంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ భూములను ఇళ్ల పట్టాలకు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ న్యాయవాది యోగేష్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేసింది. అంతేగాక దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది.