Andhra Pradesh: మంట పుట్టిస్తున్న వంటనూనెలుభారీగా పెరిగిన నిత్యావసర ధరలు
Andhra Pradesh: మంట పుట్టిస్తున్న వంటనూనెలు
Andhra Pradesh: నిత్యవసర సరుకుల ధరలు సామాన్యుడికి మంటపుట్టిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు 135 రూపాయలు ఉన్న కిలో వంట నూనె 200 రూపాయలకు చేరుకుంది. రష్యా - ఉక్రెయిన్ యుద్ధాన్ని కారణంగా చూపుతూ వ్యాపారులు అమాంతంగా ధరలు పెంచడంతో విజయనగరం జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. కరోనా కల్లోలం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రజలకు.. పెరుగుతున్న ధరలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
కొన్ని రోజులుగా నిత్యవసర సరుకుల ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. మండుతున్న ధరలతో సామాన్యుడు సరుకులను కొనలేని పరిస్థితి నెలకొంది. ఉక్రెయిన్- రష్యా మధ్య జరుగుతున్న యుద్ధమే ధరలు పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ఉక్రెయిన్ నుంచి పెద్ద ఎత్తున భారత్ పామాయిల్ దిగుమతి చేసుకుంటుంది. సరఫరా ఆగిపోవడంతో ధరలు అమాంతంగా పెరిగాయి. నిన్నమొన్నటి వరకు ధర 135 రూపాయలు ఉన్న లీటరు నూనె... ఇప్పుడు 200 రూపాయలకు చేరింది. అయితే పాత స్టాకునే అధిక ధరలకు విక్రయిస్తుండడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వంట నూనెల ధరలు అమాంతంగా పెరగడంతో ప్రజలు విలవిలలాడుతున్నారు. నూనె లేనిదే ఏ వంటా చేయలేమని గత్యంతరం లేక ధర పెరిగినా కొనాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. వ్యాపారులంతా సిండికేటుగా మారడంతోనే ధరలు పెరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. నూనెలు దిగుమతి ఆగిపోవడంతో ధరలు పెంచడం సబబేనని కానీ ఇతర సరుకుల ధరలను కూడా భారీగా పెంచేశారని ప్రజలు మండిపడుతున్నారు. అసలే పనులు లేక ఆదాయం లేక విలవిలలాడుతున్నామని.. ఇలా అయితే గంజినీళ్లే దిక్కని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పదిహేను రోజులుగా నిత్యవర సరుకుల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఉక్రెయిన్ - రష్యా యుద్ధం కారణం చూపి వ్యాపారులు చేసక్తున్న దోపిడీ చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై పెరుగుతున్న ధరలను అదుపు చేయాలని పలువురు కోరుతున్నారు.