ఆటుపోట్లు తెలుగుదేశానికి కొత్త కాదు: ఎమ్మెల్యే గద్దె
తెలుగుదేశం పార్టీకి ఆటోపోట్లు కొత్త కాదని, 38 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొందని శాసనసభ్యులు గద్దె రామమోహన్ పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీకి ఆటోపోట్లు కొత్త కాదని, 38 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొందని, 38 సంవత్సరాలలో 23 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆదరించారని, గెలుపు ఓటములు సహజమేనని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నైరాస్యం చెందవలసిన అవసరం లేదని శాసనసభ్యులు గద్దె రామమోహన్ పేర్కొన్నారు. శనివారం నాడు తూర్పు నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం శాసనసభ్యులు గద్దె రామమోహన్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా గద్దె రామమోహన్ మాట్లాడుతూ గత ఎన్నికలలో చంద్రబాబు ఎన్నో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు చేసినప్పటికీ, జగన్ ప్రజలకు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారని, కానీ సంవత్సర కాలంలో జగన్ ఇచ్చిన హామీలు అమలు పరిచిన విధానం చూసి ప్రజలు వాస్తవాలు అర్ధం చేసుకున్నారని, ఉదాహరణకు పెన్షన్ రు.3 వేలు పెంచుతామని రు.250 పెంచారని, అలాగే గతంలో చంద్రబాబు పెట్టిన సంక్షేమ పథకాలన్నీ ఎత్తివేశారని ఆయన తెలిపారు.కరోనా ఉపశమన కార్యక్రమాలలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందన్నారు. ప్రస్తుతం చేసేది తక్కువ, ప్రచారం ఎక్కువ లాగా ప్రభుత్వం నడుస్తుందని ఆయన తెలిపారు. 2 రోజలు జరిగిన అసెంబ్లీ సమావేశాలు కేవలం తమకు అనుకూలమైన బిల్లులను బలవంతంగానైనా పాస్ చేయించుకునేందుకే జరిపినట్లుగా ఉందని ఆయన పేర్కొన్నారు.
డివిజన్లో పార్టీ కమిటీలను బలోపేతం చేయండి
తూర్పు నియోజకవర్గంలో డివిజన్ల పునర్విభజనలో భాగంగా 21 డివిజన్లు అయిన సందర్భంగా ప్రతి డివిజన్లోను నూతన కమిటీలు, వాటితో పాటు బూత్ కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేయాలని గద్దె రామమోహన్ పార్టీ శ్రేణులను కోరారు. గత అసెంబ్లీ ఎన్నిక లలో డివిజన్ కమిటీలు, బూత్ కమిటీలు పటిష్టంగా పనిచేశాయని అందువలనే తామందరం విజయం సాధించామని గద్దె తెలిపారు. అలాగే ఎప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినా, డివిజన్లలో పార్టీని బలోపేతం చేసుకుని విజయబావుట ఎగురవేయాలని గద్దె కోరారు . ఈ కార్యక్రమంలో కేశినేని శ్వేత, రహీం అప్సర్, సొంగా సంజయ్ వర్మ, పేరేపి ఈశ్వర్, చెన్నుపాటి గాంధీ, దేవినేని అపర్ణ, ఎల్.శివరామ్ ప్రసాద్, ముమ్మనేని ప్రసాద్, రత్నం రమేష్, సి.హెచ్ ఉషారాణి, షేక్ సహేరాభాను, దాసరి మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.