ఉన్నత చదువులు చదివి ఉద్యోగం సాదిద్దామనుకున్నారు హైదరాబాద్ వెళ్లి గ్రూప్ వన్, గ్రూప్ 2 కోచింగ్ తీసుకుంటున్నారు. కానీ ఇంతలో కరోనా వారి ఆశలపై నీళ్లు చల్లింది లాక్ డౌన్ కారణంగా వెళ్లిన నలుగురు తిరిగి గ్రామానికి వచ్చారు. ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేయాలనుకున్నారు. నలుగురు కలిసి పొట్టేళ్ల పెంపకాన్ని చేపట్టారు. కరోనా కష్టాలను అధిగమించిన జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన నిరుద్యోగులపై హెచ్ఎంటీవి స్పెషల్ స్టోరి.
జోగులంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని బిజ్వారం గ్రామానికి చెందిన రాజు, నర్సింహులు, శేషన్న, సత్యన్న బాల్య స్నేహితులు. ఒకటో తరగతి నించి డిగ్రీ వరకు కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడాలని బావించారు కానీ కుదరలేదు. నలుగురు కలిసి గ్రామంలోనే ఉంటూ ఉపాధి పొందే ఉపాయాన్ని వెతికారు. 7 లక్షల వరకు అప్పు చేసి పొట్టేళ్ల పెంపకాన్ని ప్రారంభించారు. గ్రామ శివారులో ఒక రేకుల షెడ్డు వేసుకున్నారు. మొదట దాదాపు 100 చిన్న పొట్టేళ్లు కొనుగోళ్లతో వ్యాపారం చేస్తున్నారు.
తెలంగాణ వస్తే ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తుందనుకున్నామని, కానీ ఏ ఉద్యోగం రాకపోయే సరికి ఉపాధి కోసం పొట్టెళ్ల పెంపకాన్ని చేపట్టామని ఆ నలుగురు చెబుతున్నారు. ఈ చిన్న వ్యాపారం సక్సెస్ ఐతే మా కుటుంబ పోషణ భారం తగ్గతుందని అంటున్నారు. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూడకుండా తమ చిన్ననాటి స్నేహాన్నే పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తున్నారు ఈ యువకులు. లాక్ డౌన్ కష్టాలను అదిగమించి నిరుద్యోగ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.