యాసంగిలో అమలు చేయాల్సిన నిర్ణీత పంటల సాగు విధానంపై ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో యాసంగి పంటల విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ 2020-21 యాసంగి సీజన్‌లో 50 లక్షల ఎకరాల్లో వరిపంట, మరో 15 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయాలని సీఎం రైతులకు సూచించారు. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో ప్రభుత్వం సూచించిన మేరకు వందకు వంద శాతం నిర్ణీత పద్ధతిలోనే రైతులు పంటలు సాగు చేశారని ఆయన అన్నారు. ఇదే ఒరవడిని యాసంగిలోనూ కొనసాగించాలని సీఎం రైతులకు పిలుపునిచ్చారు. జిల్లాల వారీగా, మండలాల వారీగా, క్లస్టర్ల వారీగా ఏ పంటలు వేయాలనే విషయంలో వ్యవసాయ అధికారులు స్థానికంగా రైతులకు సూచించాలని ఆదేశించారు.
మినుములు 50 వేల ఎకరాల్లో, పొద్దు తిరుగుడు 30-40 వేల ఎకరాల్లో, వరి పంటను 50 లక్షల ఎకరాల్లో, పెసర్లు 50 నుంచి 60 వేల ఎకరాల్లో, ఆవాలు-కుసుమలు-సజ్జలు లాంటి పంటలు మరో 60 నుంచి 70 వేల ఎకరాల్లో, శనగ 4.5 లక్షల ఎకరాల్లో, వేరుశనగ 4 లక్షల ఎకరాల్లో, మిరపతో పాటు ఇతర కూరగాయలు లక్షన్నర నుంచి రెండు లక్షల ఎకరాల్లో, జొన్న లక్ష ఎకరాల్లో, నువ్వులు లక్ష ఎకరాల్లో సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాధికారులు సూచించిన మేరకు రైతులు పంటలు సాగు చేయాలని తద్వారా మంచి ధర పొందాలని సీఎం పేర్కొన్నారు. ఈ పంటలకు సంబంధించిన విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచినట్లు సీఎం వెల్లడించారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎంవో అధికారులు స్మితా సబర్వాల్, ప్రియాంక వర్గీస్, అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసి ప్రవీణ్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, ఉద్యానవనశాఖ ఎండి వెంకట్రామ్ రెడ్డి, జేడీ శోభారాణి తదితరులు పాల్గొన్నారు.