National Turmeric Board: నెరవేరిన ఇందూరు పసుపు రైతుల కల.. నేటి నుంచే ప్రారంభం కానున్న పసుపు బోర్డు కార్యకలాపాలు..!

National Turmeric Board: ఇందూరు రైతుల చిరకాల వాంఛ నెరవేరింది. సంక్రాంతి పర్వదినాన కేంద్రప్రభుత్వ ప్రకటనతో పసుపు రైతన్నల పంట పండింది.

Update: 2025-01-14 01:26 GMT

National Turmeric Board: ఇందూరు రైతుల చిరకాల వాంఛ నెరవేరింది. సంక్రాంతి పర్వదినాన కేంద్రప్రభుత్వ ప్రకటనతో పసుపు రైతన్నల పంట పండింది. జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్‌‌లో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా 2023 అక్టోబరు 1న మహబూబ్‌నగర్‌ సభలో ప్రధాని మోదీ ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబరు 4న కేంద్ర వాణిజ్యశాఖ దీనిపై గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసేదీ అందులో పేర్కొనలేదు. తాజాగా నిజామాబాద్‌లో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. దానికి ఛైర్మన్‌గా నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌ గ్రామానికి చెందిన భాజపా నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమిస్తూ.. కేంద్ర వాణిజ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పసుపు రైతుల ఎన్నో ఏళ్ల ఎదురుచూపులు ఫలించాయి.

రైతుల పండగ సంక్రాంతి సందర్భంగా మంగళవారం నిజామాబాద్‌ కేంద్రంగా బోర్డు ప్రధాన కార్యాలయాన్ని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రారంభించనున్నారు. దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బోర్డును ప్రారంభించబోతున్నట్లు ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ప్రకటించారు. ప్రస్తుతం నిజామాబాద్‌లో ఉన్న రీజినల్‌ స్పైస్‌ బోర్డు కార్యాలయంలోనే నేటి నుంచి కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి. దీంతో నిజామాబాద్‌లో పసుపు రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

 ప్రపంచంలోనే అత్యధికంగా పసుపు భారత్‌లో సాగవుతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 3.24 లక్షల హెక్టార్లలో సాగు చేయగా.. 11.61 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సాగయ్యే పంటలో ఇది 75%. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 2.78 లక్షల టన్నులు, ఆ తర్వాత తెలంగాణలో 2.32 లక్షల టన్నులు పండింది. 2022-23లో 207.45 మిలియన్‌ డాలర్ల విలువైన 1.53 లక్షల టన్నుల పసుపు, పసుపు ఆధారిత ఉత్పత్తులు భారత్‌ నుంచి ఎగుమతి అయ్యాయి. ప్రపంచ మార్కెట్‌లో భారత్‌ వాటా సుమారు 62 శాతం. నాణ్యమైన పంట పండేలా రైతులను ప్రోత్సహించడంతో పాటు ప్రపంచ మార్కెట్‌లో భారత్‌కున్న అగ్రస్థానాన్ని నిలబెట్టేలా పసుపు బోర్డు చేయూత అందిస్తుంది. ఇందులో కేంద్ర ఆయుష్, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయ, వాణిజ్య శాఖలకు చెందినవారిని సభ్యులుగా నియమించనున్నారు. పసుపును అత్యధికంగా పండించే మూడు రాష్ట్రాలకు చెందిన సీనియర్‌ అధికారులకు రొటేషన్‌ పద్ధతిలో అవకాశం కల్పిస్తారు. కేంద్ర/రాష్ట్ర పరిశోధన సంస్థల్లో పనిచేసే నిపుణులు, పసుపు రైతులు, ఎగుమతిదారులకూ సభ్యత్వం ఇస్తారు.

పసుపు రైతుల సమస్యలు, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు కేంద్రం ఈ బోర్డు స్థాపించనుంది. తెలంగాణ రాష్ట్రంలో పసుపు సాగులో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, కొమురంభీం తదితర జిల్లాలలోని రైతులకు ఈ బోర్డు ద్వారా మరింత సాయం అందనుంది. కేంద్ర ప్రభుత్వం పసుపు పంటను ఒక ప్రత్యేకమైన పరిశ్రమగా భావించి, రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ఈ బోర్డు ఏర్పాటును ప్రకటించింది. మరోవైపు పల్లె గంగారెడ్డి రైతు సంక్షేమం కోసం పోరాడిన వ్యక్తి. ఆయన వ్యవసాయ రంగం మీద అవగాహన, పసుపు రైతుల సమస్యలను అర్థం చేసుకోవడంలో అనుభవం ఉన్న వ్యక్తి కావడంతో ఆయన నియామకాన్ని కేంద్రం సమర్థించింది. పసుపు బోర్డు ఏర్పాటు ద్వారా రైతులకు అనేక కొత్త అవకాశాలు రానున్నాయి. రైతులు పసుపు పంటను మరింత మంచి ధరలలో విక్రయించేందుకు మరింత సహాయాన్ని అందుకోనున్నారు.

Tags:    

Similar News