Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇండ్ల పథకం.. లబ్దిదారులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్
Indiramma Housing Scheme: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది.
Indiramma Housing Scheme: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. జనవరి 26 న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి జిల్లాల వారీగా జిల్లా ఇంచార్జీ మంత్రులు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. గ్రామ సభలు నిర్వహించి ఇందిరమ్మ లబ్దిదారులు, రైతు భరోసా పథకానికి సంబంధించి లబ్దిదారులను ఎంపిక చేస్తారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లబ్దిదారులకు అవసరమైన ఇసుకను ఉచితంగా ఇవ్వనుంది. రాష్ట్రంలో 4.16 లక్షల ఇళ్లను నిర్మించనున్నారు. దీని కోసం 112 లక్ష క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఇసుకను లబ్దిదారులకు ఉచితంగా ఇవ్వనున్నారు. ఆయా జిల్లాల్లో ఇసుక సరఫరాకు అనువుగా ఉన్న రీచ్ లు, వాగులను గుర్తించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ఇటుకల తయారీని మహిళ సంఘాలతో చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందిరమ్మ ఇళ్లకు 101 కోట్ల ఇటుకలు అవసరమౌతున్నందున వాటిని మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా తయారు చేయించడం ద్వారా మహిళలకు కూడా ఉపాధి దొరుకుతుందని భావిస్తున్నారు. ప్రతి మండలానికి మూడు ఇటుక తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇటుకల తయారీ యూనిట్ ఏర్పాటుకు 18 లక్షలను ప్రభుత్వం రుణంగా అందించే అవకాశం ఉంది.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్టీల్, సిమెంట్ ను తక్కువ ధరకు ఇచ్చే విషయమై ఆయా సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. తక్కువ ధరకు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. ఇంటి స్థలం ఉండి ఇళ్లు లేని వారికి తొలుత ఈ పథకం ఎంపిక చేస్తారు. అద్దె ఇంటిలో ఉంటున్నవారు కూడా ఈ పథకం కింద అర్హులే. జిల్లా ఇంచార్జీ మంత్రి అధ్యక్షతన లబ్దిదారుల జాబితాను కలెక్టర్లు ఫైనల్ చేస్తారు. ఆయా గ్రామాలు, మున్సిపాలిటీల్లో జనాభా ఆధారంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఉంటుంది. నాలుగు విడతల్లో లబ్దిదారులకు 5 లక్షలను ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇదే పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు 6 లక్షల ఆర్ధిక సహాయం ఇస్తారు ఐదేళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మించాలనేది ప్రభుత్వ టార్గెట్.