Padi Kaushik Reddy arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్
Padi Kaushik Reddy arrest: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఆదివారం కరీంనగర్ జడ్పీ సమీక్ష సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డికి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పాడి కౌశిక్ రెడ్డి సంజయ్ పై చేయి చేసుకున్నారు.
ఇదే విషయమై ఇవాళ ఉదయం సంజయ్ కుమార్ వెళ్లి కరీంనగర్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంజయ్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు కొద్దిసేపటి క్రితం జూబ్లీహిల్స్ చేరుకుని ఆయన్ను అరెస్ట్ చేశారు. పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ తరలిస్తున్నారు. అక్కడ జిల్లా జడ్జి ఎదుట ఆయన్ను హాజరుపరచనున్నట్లు తెలుస్తోంది. పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ ఘటనతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అలర్ట్ అయ్యాయి. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కౌశిక్ రెడ్డికి మద్దతుగా ఇప్పుడిప్పుడే ఆయన ఇంటికి చేరుకుంటున్నారు.
కరీంనగర్ ఘటనపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందిస్తూ... పాడి కౌశిక్ రెడ్డి ఒక వీధి రౌడిలా తనపై దాడి చేశారని అన్నారు. "ఈ దాడి కౌశిక్ స్వయంగా చేశారా లేక ఆయన వెనుక ఇంకెవరైనా ఉండి రెచ్చగొట్టి తనపై దాడి చేయించారా" అని అనుమానం వ్యక్తంచేశారు. ఈ దాడి ఘటనపై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు కూడా ఫిర్యాదు చేశానన్నారు.
తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడాన్ని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తుండటాన్ని సంజయ్ తప్పుపట్టారు. ఇతర పార్టీల నేతలను తమ పార్టీలో చేర్పించుకోవడాన్ని బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్ ప్రోత్సహించారని... ఇవాళ వారు తనను ఎలా తప్పుపడతారని ప్రశ్నించారు. ముందుగా కేటీఆర్, కేసీఆర్ తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేస్తే తాను కూడా రాజీనామా చేయడానికి సిద్ధమని సంజయ్ చెప్పుకొచ్చారు. సంజయ్ కుమార్‌కు దమ్ముంటే రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్‌పై గెలవాలి అని నిన్న పాడి కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. పాడి కౌశిక్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేతలు మద్దతు పలికారు. బీఆర్ఎస్ నేతలకు సమాధానంగా స్పందిస్తూ సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.