Revanth Reddy Foreign Tour: రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్... ఎప్పుడు, ఎక్కడ?
CM Revanth Reddy's Foreign visit schedule: సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. జనవరి 17 నుండి 23వ తేదీ వరకు పెట్టుబడులే లక్ష్యంగా ఆయన విదేశాల్లో పర్యటించనున్నారు. తొలుత రేవంత్ రెడ్డి సింగపూర్ వెళ్తారు. అక్కడ షాపింగ్ మాల్స్, స్టేడియంలు పరిశీలించనున్నారు. ఆ తరువాత అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వారికి వివరించనున్నారు. రేవంత్ రెడ్డి రెండురోజుల పాటు సింగపూర్‌లో పర్యటించనున్నారు.
జనవరి 19న సింగపూర్ నుండి స్విట్జర్లాండ్‌లోని దావోస్ వెళ్తారు. దావోస్‌లో ప్రతీ సంవత్సరం జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అక్కడ కూడా పెట్టుబడులే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగనుంది. ఆ తరువాత జనవరి 23న ఇండియాకు తిరిగిరానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక పెట్టుబడులు ఆకర్షించడం కోసం విదేశాల్లో పర్యటించడం ఇది రెండోసారి.
ఈ నెల 14న ఢిల్లీలో జరగనున్న ఏఐసిసి సమావేశం కోసం ఆరోజే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడే ఏఐసీసీ సమావేశాలు చూసుకున్న తరువాత అక్కడి నుండే సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు కూడా వెళ్లే అవకాశం ఉంది.