Rythu Bharosa: రైతులకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. వ్యవసాయం చేయకున్నా ఆ భూములకు రైతు భరోసా..
Rythu Bharosa: రైతు భరోసాను 2025 జనవరి 26న నుంచి విడుదల చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Rythu Bharosa: రైతు భరోసాను 2025 జనవరి 26న నుంచి విడుదల చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేసింది. వ్యవసాయానికి పనికిరాని భూమి, రియల్ ఏస్టేట్ భూములు, లే ఔట్ చేసిన భూములు, నాలా కన్వర్జేషన్ చేసిన భూములు, మైనింగ్ భూములు, గోదాములు, ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం సేకరించిన భూముల వివరాలను సేకరించాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. ఈ భూములకు రైతు భరోసా వర్తించదు. ఈ భూముల వివరాలను గ్రామసభల్లో ప్రకటించనున్నారు.తద్వారా రైతుభరోసాకు సంబంధించి గ్రామసభల్లోనే అర్హుల వివరాలపై స్పష్టత రానుంది. అనర్హులకు రైతు భరోసా కింద డబ్బులు విడుదల చేయవద్దని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి పనికిరాని భూములకు కూడా రైతుబంధు కింద పెట్టుబడి సహాయం చేయడంపై కాంగ్రెస్ అప్పట్లో విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
రైతు భరోసాకు సంబంధించిన మార్గదర్శకాలకు సంబంధించి ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టత ఇచ్చారు.పంట వేసినా, వేయకపోయినా వ్యవసాయానికి పనికి వచ్చే ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయానికి పనికిరాని భూములకు గత ప్రభుత్వం రైతు బంధును అమలు చేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు.
వ్యవసాయానికి పనికి వచ్చే భూములకు రైతు భరోసా కింద ప్రభుత్వం సహాయం అందిస్తుంది. వ్యవసాయానికి పనికిరాని భూములకు రైతు భరోసా కింద ఆర్ధిక సహాయం అందించరు. ఈ భూముల వివరాలను గ్రామసభల ద్వారా ప్రజలకు వివరిస్తారు.
రైతుభరోసా కింది ప్రభుత్వ సహాయం అందాలంటే ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏటా రెండు సీజన్లకు ఆరు వేల చొప్పున పన్నెండు వేలను ప్రభుత్వం పెట్టుబడి సహాయంగా అందించనుంది.
తెలంగాణలోని 1.35 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమికి సంబంధించిన లబ్దిదారులకు రైతు భరోసా అందించనుంది ప్రభుత్వం. వ్యవసాయ యోగ్యమైన భూములు కలిగిన 64 లక్షల మంది రైతులకు రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం అందుతోంది. గ్రామసభల ద్వారా వ్యవసాయానికి యోగ్యంగా లేని భూముల జాబితాను గుర్తిస్తారు. రైతు భరోసా కోసం రాష్ట్ర ప్రభుత్వం 8400 కోట్లు ఖర్చు చేయనుంది.