KTR Press Meet: అల్లు అర్జున్‌ను ఉద్దేశించే రేవంత్ రెడ్డి గురించి ఆ కామెంట్ చేశారా?
KTR Press Meet: గత పదేళ్లలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నాయకత్వంలో నిబద్ధతతో ఎక్కడా పైసా అవినీతికి తావు లేకుండా పనిచేశామని ఏసీబీ అధికారులకు చెప్పానన్నారు. రేవంత్ రెడ్డి రాసిచ్చిన నాలుగు ప్రశ్నలనే వారు తిప్పి తిప్పి అడగడం తప్ప వాళ్లు కూడా చేయగలిగిందేమీ లేదని కేటీఆర్ అన్నారు. కేసులో విషయం లేకపోవడంతో ఏసీబీ అధికారులు సైతం ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రపంచంలో హైదరాబాద్‌ను గొప్పగా చూపించాలనే విజన్‌తోనే ఫార్ములా ఈ రేస్ నిర్వహించడం జరిగిందన్నారు. అందులో ఎలాంటి అవినీతి లేదని ఏసీబీ అధికారులకు చెప్పానన్నారు. ఇలాంటివి ఇంకో 100 కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మీరు ఎన్ని కేసులు పెట్టినా.. మీరు తెలంగాణ ప్రజలకు ఇస్తానని ఇవ్వకుండా మోసం చేసిన హామీల గురించే ఈ ఏడాదంతా మాట్లాడతామని కేటీఆర్ తేల్చిచెప్పారు.
విదేశాలు తిరిగి పెట్టుబడులు తెచ్చిన వాళ్లం కనుక విదేశాల స్థాయిలో మన రాష్ట్రం, మన హైదరాబాద్ డెవలప్ కావాలనే తపన తమకు ఉందన్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఆయన జైలుకు వెళ్లొచ్చారు కనుక అందరినీ జైలుకు పంపాలనే తపనతో ఉన్నారని అన్నారు. రేవంత్ రెడ్డికి, మాకు తేడా అదే అని చెప్పుకొచ్చారు. నీకు (సీఎం రేవంత్ రెడ్డి) భయపడే వాడు ఎవ్వడూ బీఆర్ఎస్ పార్టీలో లేడని అన్నారు. మిమ్మల్ని రాష్ట్రంలో ఎవ్వరూ ముఖ్యమంత్రి కింద చూడటం లేదన్నారు. "ఆయనెవరో నీ పేరు చెప్పడం కూడా మర్చిపోయాడని నేను అన" అని వ్యాఖ్యానించారు.
కొంతమందికి నీ పేరు కూడా గుర్తుండటం లేదని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనియాంశమయ్యాయి. గతంలో పుష్ప 2 సక్సెస్ మీట్‌లో అల్లు అర్జున్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పడానికి తడబడిన ఘటనను ఉద్దేశించే కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్న వ్యవహారాన్ని కేటీఆర్ మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.