Formula E Race Case: క్విడ్ ప్రో కి పాల్పడలేదు: కేటీఆర్
KTR: ఫార్మూలా ఈ కారు రేసు కేసులో నిజం నిలకడ మీద తెలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
KTR: ఫార్మూలా ఈ కారు రేసు కేసులో నిజం నిలకడ మీద తెలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు హైదరాబాద్ నందినగర్ లోని తన నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.కేసీఆర్ కొడుకుగా తెలంగాణ కోసం చస్తాను తప్ప. తప్పు చేయనని ఆయన అన్నారు. హైదరాబాద్ ప్రతిష్టను పెంచడంతో బ్రాండ్ ఇమేజ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు తాను ప్రయత్నాలు చేశానని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రూ.1,137 కోట్ల కాంట్రాక్టులు తన బావమరిదికి ఇవ్వలేదని పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన సెటైర్లు వేశారు. మంత్రిగా ఉంటూ తన కొడుకు కంపెనీకి కాంట్రాక్టులు ఇవ్వలేదు.. దానికి ప్రతిఫలంగా ల్యాండ్ క్రూజర్ కార్లు కొనలేదని ఆయన పరోక్షంగా ఓ మంత్రిపై ఆరోపణలు చేశారు.
ఫార్మూలా ఈ కారు రేసు కేసులో ఒక్క పైసా అవినీతి చేయలేదని ఆయన అన్నారు. కొందరు కాంగ్రెస్ నాయకులు తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు చేసేందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే అక్రమంగా తనపై కేసులు నమోదు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇంకా వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటానని ఆయన చెప్పారు. చట్టాలు, రాజ్యాంగంపై విశ్వాసం ఉందని కేటీఆర్ తెలిపారు. పార్మూలా ఈ కారు రేసు ఒప్పందంలో తాను క్విడ్ ప్రో కి పాల్పడలేదని ఆయన అన్నారు.