Telangana Cabinet Expansion: రేవంత్‌కు కేబినెట్ విస్తరణకు అడ్డంకులు ఏంటి?

Update: 2025-01-14 01:30 GMT

Telangana cabinet Telangana cabinet expansion: రేవంత్‌కు కేబినెట్ విస్తరణకు అడ్డంకులు ఏంటి?

Challenges in front of CM Revanth Reddy: రేవంత్ రెడ్డికి కేబినెట్ విస్తరణ కత్తిమీద సామేనా? ఏడాది దాటినా ఆరు మంత్రి పదవులు ఎందుకు భర్తీ కాలేదు? సామాజిక సమీకరణాలే కారణమా? సీనియర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదా? ఆరు పోస్టులకు డజను మందికిపైగా మంది పోటీ పడుతున్నారా? మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కావడానికి కారణాలు ఏంటి? కీలక శాఖలకు మంత్రులు లేకపోవడం పాలనపై ప్రభావం చూపుతోందా? కేబినెట్ విస్తరణపై హస్తం పార్టీ పెద్దల ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఎప్పటివరకు కేబినెట్ విస్తరణ పూర్తవుతోందో ఈ ట్రెండింగ్ స్టోరీలో తెలుసుకుందాం.

Full View

మంత్రివర్గ విస్తరణ ఎందుకు ఆలస్యమైంది?

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సమయంలో తనతో పాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.కేబినెట్ లో హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ప్రాతినిథ్యం లేదు. ఈ జిల్లాలకు విస్తరణలో చోటు ఖాయంగా చెబుతున్నారు.. 2024 డిసెంబర్ లోనే కేబినెట్ విస్తరణ చేయాలని భావించారు. కానీ మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలనే దానిపై సీనియర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.దీంతో విస్తరణ వాయిదా పడింది. దీనికి తోడు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పార్టీ సీనియర్లు ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టాల్సి వచ్చింది.ఇది కూడా కేబినెట్ విస్తరణకు బ్రేకులు వేసింది. ప్రస్తుతం దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల తర్వాతే పార్టీ నాయకత్వం కేబినెట్ విస్తరణపై ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది.

కేబినెట్ విస్తరణ ఎప్పుడు?

ఈ ఏడాదిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఒక్క అసెంబ్లీ సీట్లో కూడా కాంగ్రెస్ గెలవలేదు. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికలను గెలవాలనే లక్ష్యంతో ఆ పార్టీ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. హైదరాబాద్ లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఆపరేషన్ ఆకర్ష్ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జనవరి 11న మీడియా చిట్ చాట్ లో చెప్పారు. సంక్రాంతి తర్వాత మంచి రోజులు లేవు. ఇది కేబినెట్ విస్తరణకు అడ్డంకి. మరో వైపు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉన్నారు. రేవంత్ రెడ్డి కూడా జనవరి 19న థావోస్ టూర్ వెళ్లనున్నారు.జనవరి 23న ఆయన హైదరాబాద్ తిరిగి వస్తారు. అన్ని అనుకూలిస్తే జనవరి చివరివారంలో కేబినెట్ విస్తరణ ఉంటుంది. ఒకవేళ అప్పటికీ కేబినెట్ విస్తరణ సాధ్యం కాకపోతే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది.

కేబినెట్ లో ఆ ఇద్దరికి చోటు దక్కుతుందా?

అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని పార్టీ నాయకత్వం హామీ ఇచ్చినట్టు ప్రచారంలో ఉంది. నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఉన్నారు. ఇదే జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరిద్దరిది రెడ్డి సామాజిక వర్గం. ఒకే ఇంటి నుంచి రెండు మంత్రి పదవులు ఇస్తే తన భార్య పద్మావతిని కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అధిష్టానం ముందు ప్రతిపాదన పెట్టారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారంలో ఉంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వివేక్ వెంకటస్వామి కూడా కేబినెట్ లో బెర్త్ కోసం ఆశగా ఉన్నారు. ఆయన సోదరుడు వినోద్ కూడా తనకు కేబినెట్ లో చోటు ఇవ్వాలని ఇప్పటికే అధిష్టానాన్ని కోరారు.ఇక ఇదే జిల్లాకు చెందిన ప్రేంసాగర్ రావు కూడా తనకు మంత్రి పదవిని ఇవ్వాలని కోరుతున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మద్దతు ఉందనే ప్రచారం కూడా పార్టీ వర్గాల్లో సాగుతోంది. బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరే సమయంలో తనకు ఇచ్చిన హామీ మేరకు కేబినెట్ లో చోటు దక్కుతోందనే ధీమా వివేక్ లో ఉంది.

ఆ నాలుగు జిల్లాల్లో ఎవరికి చోటు

రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ప్రాతినిథ్యం లేదు. ఈ నాలుగు జిల్లాలకు విస్తరణలో ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. నిజామాబాద్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి కేబినెట్ లో చోటు ఖాయంగా చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి మైనార్టీలు రేసులో ఉన్నారు.

ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూట్స్ సోసేటీ ప్రెసిడెంట్ మహమ్మద్ ఫహీమ్ ఖురేషీ, వక్ఫ్ బోర్డు ఛైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హున్సేనీ, నాంపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిన ఫిరోజ్ ఖాన్ మంత్రి పదవి కోసం రేసులో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఎవరైనా చేరితే వారిని కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉందనే చర్చ కూడా ఉంది.పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకోవడాన్ని అప్పట్లో పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి వ్యతిరేకించారు.

ఇప్పుడు అదే తప్పు ఆయన చేయకపోవచ్చనే పార్టీలో మరికొందరు చెబుతున్నారు. పార్టీ ఫిరాయించినవారికి కేబినెట్ లో చోటు కల్పించాల్సి వస్తే హైదరాబాద్ కోటాలో దానం నాగేందర్ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కడియం శ్రీహరి కూడా రేసులో ముందుంటారు. అయితే నాలుగు రోజుల క్రితం దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారితీశాయి.

ఫార్మూలా ఈ కారు రేసు కు అనుకూలంగా ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను ఆయన పొగిడారు. ఈ వ్యాఖ్యలు నాగేందర్ ఎందుకు చేశారనేది ప్రశ్న. ఇక రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్ణణం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, టి. రామ్మోహన్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తన సీనియారిటీతో పాటు పార్టీకి అందించిన సేవలను ప్రస్తావిస్తూ తనకు కేబినెట్ లో చోటు కల్పించాలని మల్ రెడ్డి రంగారెడ్డి 2024 డిసెంబర్ లో కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాశారు. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డికి మండలిలో చీఫ్ విప్ పదవిని ఇచ్చారు. దీంతో ఆయనకు మంత్రి పదవి లేనట్టే.

సామాజికవర్గాలకు ప్రాధాన్యత

మంత్రివర్గ విస్తరణలో సామాజికవర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది.రేవంత్ కేబినెట్ లో ఏడుగురు ఓసీలు, ఇద్దరు బీసీలు, ఇద్దరు ఎస్ సీ లు, ఒకరు ఎస్టీ సామాజికవర్గానికి చోటు దక్కింది. బీసీలో యాదవ, ముదిరాజ్ సామాజికవర్గాలకు కేబినెట్ లో చోటు లేదు. ముదిరాజ్ లకు కేబినెట్ లో చోటు కల్పిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ నుంచి ముదిరాజ్ సామాజికవర్గం నుంచి శ్రీహరి ఒక్కరే గెలిచారు. ఆయనకు కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యాదవ సామాజిక వర్గం నుంచి బీర్ల అయిలయ్య పేరు కూడా మంత్రివర్గం రేసు వినిపిస్తోంది.మరో వైపు ఎస్టీ సామాజిక వర్గంలోని లంబాడా నుంచి కేబినెట్ లో చోటు కల్పించాలనే డిమాండ్ కూడా ఉంది. ఈ పోస్టు కోసం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని బాలునాయక్ పేరు కూడా వినిపిస్తోంది. అయితే ఇప్పటికే ఉమ్మడి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కేబినెట్ లో చోటు కోసం పోటీ ఎక్కువగా ఉంది. దీనిపై పార్టీ నాయకత్వం నిర్ణయాన్ని బట్టి స్టెప్స్ ఉంటాయి.

డిప్యూటీ స్పీకర్ పదవితో కేబినెట్ విస్తరణకు లింకు

డిప్యూటీ స్పీకర్ పదవితో పాటు చీఫ్ పదవిని కూడా భర్తీ చేయాలి. కేబినెట్ రేసులో ఉన్నవారికి డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబడితే రేసు నుంచి ఒకరిని తప్పించవచ్చు. దీనికితోడు పీసీసీ కార్యవర్గంలో చోటుతో పాటు నామినేటేడ్ పోస్టులను భర్తీ చేయాలి. జనవరి చివరి నాటికి నామినేటేడ్ పోస్టులు భర్తీ చేస్తారు. ఇవి పూర్తైతే కేబినెట్ లో ఎవరికి చోటు దక్కుతుందనే విషయమై మరింత స్పష్టత వస్తుంది.

నలుగురికి షాక్ తప్పదా?

ప్రస్తుతం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్న నలుగురికి ఉద్వాసన తప్పదనే ప్రచారం సాగుతోంది. పనితీరు ఆధారంగానే మంత్రుల కొనసాగింపు ఉంటుందని చెబుతున్నారు. మంత్రుల పనితీరుపై పార్టీ నాయకులు కేసీ వేణుగోపాల్ వద్ద సమాచారం ఉంది. ఈ సమాచారం ఆధారంగానే కేబినెట్ విస్తరణలో చోటు ఉంటుందని చెబుతున్నారు. అయితే ఉద్వాసనకు గురయ్యే నలుగురు ఎవరనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. మరో వైపు కీలక మంత్రి పదవులు ప్రస్తుతం సీఎం వద్దే ఉన్నాయి. హోం, విద్య, పురపాలక వంటి శాఖలన్నీ ఆయనే వద్దే ఉన్నాయి. కేబినెట్ విస్తరణ పూర్తైతే తన వద్ద ఉన్న శాఖలను రేవంత్ కొత్త మంత్రులు లేదా పాతవారికి కేటాయించే అవకాశం ఉంది.

మంత్రివర్గ విస్తరణ పూర్తైతే పాలనపై మరింత ఫోకస్ పెట్టేందుకు అవకాశం ఉంటుంది. పార్టీ సీనియర్లతో మరోసారి కేబినెట్ విస్తరణపై అధిష్టానం చర్చించే అవకాశం ఉంది. సీనియర్లు పచ్చజెండా ఊపితే కేబినెట్ విస్తరణకు అడ్డంకులు ఉండవని చెబుతున్నారు.

Tags:    

Similar News