Indiramma Atmiya Bharosa: ఏడాదికి రూ. 12 వేలు.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంకు అర్హులు వీరే..!
Indiramma Atmiya Bharosa: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు భూమిలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ప్రతి ఏడాది 12 వేల రూపాయాలు అందించనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.
Indiramma Atmiya Bharosa Scheme: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు భూమిలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ప్రతి ఏడాది 12 వేల రూపాయాలు అందించనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలో సుమారు 10 లక్షల మందికి ఈ పథకం కింద ప్రయోజనం దక్కుతుంది. ఈ పథకం అమలు చేయడం ద్వారా ప్రభుత్వంపై ఏటా 1200 కోట్లు అదనపు భారం పడుతుంది. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రామాణికంగా తీసుకోనుంది ప్రభుత్వం. దీని ఆధారంగా లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు.
తెలంగాణలో 29 లక్షల మంది కూలీలకు వ్యవసాయ భూమి లేదని ప్రభుత్వం గుర్తించింది. భూమి లేని కూలీలు ఉపాధి హామీ పథకం కింద ఏడాదికి కనీసం 20 రోజుల పాటు కూలీ పనికి వెళ్లిన వారికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద లబ్దిదారులుగా ఎంపిక చేయాలని రేవంత్ సర్కార్ మార్గదర్శకాలు జారీ చేసింది.
ఏడాదికి రెండుసార్లు ఈ పథకం కింద లబ్దిదారులకు ప్రభుత్వం నగదును అందించనుంది. 2025 జనవరి 21 నుంచి 24 వరకు గ్రామాల్లో నిర్వహించే గ్రామ సభల్లో లబ్దిదారులను ఎంపిక చేస్తారు. ఈ సభల్లో ఈ జాబితాను చదివి వినిపిస్తారు. ఈ జాబితాపై గ్రామస్థుల నుంచి అభ్యంతరాలు ఉంటే చర్చిస్తారు. అభ్యంతరాలు లేని జాబితాను ఆమోదిస్తారు. అభ్యంతరాలు వచ్చిన వాటిని తిరిగి ఎంపీడీఓ పరిశీలించి గడువులోపుగా సమస్యను పరిష్కరిస్తారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కోసం జాబ్ కార్డు, ఆధార్ కార్డుల్లో ఒకే రకమైన పేరు ఉందా.. లేదా అనే విషయాన్ని కూడా అధికారులు పరిశీలిస్తారు. బ్యాంకు ఖాతాను పరిశీలిస్తారు. అయితే బ్యాంకు ఖాతాలు, ఆధార్ కార్డుల్లో తేడాలున్నవారు మార్పులు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అధికారులు సూచనలతో ఇప్పటికే 4,99,495 మంది తమ ఆధార్ కార్డుల్లో సవరణలు చేసుకున్నారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద మార్గదర్శకాలు
ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు కలిగి ఉండాలి
బ్యాంక్ ఖాతా ఉండాలి
2023-24 ఆర్ధిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో కనీసం 20 రోజులు పనిచేసి ఉండాలి
బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు లింక్ చేసి ఉండాలి
ధరణి పోర్టల్ లో లబ్దిదారుల పేరుతో భూమి ఉండకూడదు
గ్రామ పంచాయితీ తీర్మాణం సమయంలో అభ్యంతరాలు ఉండొద్దు