Hyderabad: హైదరాబాద్‌లో డెత్ స్పాట్లుగా ట్రాన్స్‌ఫార్మర్లు
Hyderabad: హైదరాబాద్ నగరంలోని ట్రాన్స్‌ఫార్మర్లు పిల్లల పాలిట డేంజర్ స్పాట్లుగా మారాయి.
Hyderabad: హైదరాబాద్ నగరంలోని ట్రాన్స్‌ఫార్మర్లు పిల్లల పాలిట డేంజర్ స్పాట్లుగా మారాయి. వాటి చుట్టూ కనీసం ఫెన్సింగ్ కూడా లేకపోవడంతో ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. ఇప్పటికే ఇలాంటి ఘటనల్లో ఎంతో మంది మృత్యువాత పడగా.. మరికొందరు గాయాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. తాజాగా.. ఇలాంటిదే మరో ఘటన భాగ్యనగరంలో వెలుగుచూసింది.
మౌలాలి మారుతినగర్‌లోని ఎమ్మార్ హోమ్స్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే జానకికి ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు నిశాంత్ అపార్ట్‌మెంట్ ఆవరణలో తోటి స్నేహితులతో ఆడుకుంటూ.. ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకాడు. దీంతో విద్యుత్ షాక్‌కు గురై కిందపడిపోయాడు. హుటాహుటిన స్థానికులు.. దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. నిశాంత్ వయసు 8ఏళ్లు కాగా.. అతడి పరిస్థితి విషమంగా ఉందని, 48 నుంచి 72 గంటలు గడిస్తేనేగానీ ఏం చెప్పలేమని వైద్యులు చెబుతున్నారని తెలిపారు బాలుడి తల్లి జానకి.
మరోవైపు.. ఇటీవల కాలంలో ఈ తరహా ఘటనలు ఎన్నో జరిగాయని అంటున్నారు స్థానికులు. అదే అపార్ట్‌మెంట్‌లోని రెండో ఫ్లోర్‌లో బట్టలు ఆరేస్తుండగా.. ట్రాన్స్‌ఫార్మర్ తగిలి ఓ గృహిణి మృతిచెందిందని చెప్పారు స్థానికులు. ఇవన్నీ అధికారుల నిర్లక్ష్యంతోనే జరుగుతున్నాయని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. నివాస ప్రాంతాల్లోని ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.
ఇక.. సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా ఈ ఘటన మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లింది. దీనిపై ట్విట్టర్‌లో స్పందించిన మంత్రి కేటీఆర్.. బాధిత కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బాలుడికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు చేపడతామన్నారు మంత్రి కేటీఆర్.