Telangana: తెలంగాణాలోని పలు జిల్లాల వార్తలు
Telangana: తెలంగాణలో పలు జిల్లాల వారిగా తాజా వార్తలు
Telangana:
మేడ్చల్ జిల్లా:
మేడ్చల్ జిల్లా కీసర పీఎస్ పరిధిలోని అహ్మద్ గూడ ఆర్‌జీకే కాలనీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 8 వాహనాలు, మద్యం, పొగాకు చెలిటీన్ వైర్‌లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు డీసీపీ రక్షిత మూర్తి తెలిపారు.
మంచిర్యాల:
మంచిర్యాలలో ఎమ్మెల్యే దివాకర్ రావుకు చేదు అనుభవం ఎదురైంది. పట్టణ ప్రగతిలో భాగంగా మున్సిపాలిటీలో అభివృద్ధి పనులను పర్యవేక్షించడానికి మున్సిపల్ ఛైర్మన్ పెంటరాజయ్యతో కలిసి వెళ్లిన దివాకర్ రావును స్థానికులు అడ్డుకున్నారు, పట్టణ ప్రగతిలో ప్రగతి ఎక్కడ చూపెట్టాలని నిలదీశారు. దీంతో ఏం చేయాలో తెలియక వెనుదిరిగి ఎమ్మెల్యే దివాకర్ రావు వెళ్లిపోయారు.
సంగారెడ్డి జిల్లా:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బూచినెల్లిలో 20 కోట్లతో నిర్మించిన మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఎన్ని నిధులైనా విచ్చించడానికి వెనకాడబోమని స్పష్టం చేశారు. అంతకు ముందు కోహిర్ మండలం బిలాల్పూర్, సర్జాపూర్, జహీరాబాద్ మండలం కొత్తూరు, మొగుడంపల్లీలోని ధనసరిలో పల్లె ప్రకృతి వనం, రైతు వేదిక భవనాలను ప్రారంభించారు.
ఆదిలాబాద్ జిల్లా:
వంతెన నిర్మాణం కోసం ఆదిలాబాద్ జిల్లా జైనాత్ మండలం పార్థికే గ్రామస్తులు వినూత్న నిరసనకు దిగారు. వాగులో జలదీక్ష చేపట్టారు. బ్రిడ్జి నిర్మాణం చేపట్టే వరకు ఆందోళన కొనసాగిస్తామని గ్రామస్తులు చెబుతున్నారు. బ్రిడ్జి నిర్మాణం కోసం మూడు కోట్ల నిధులు మంజూరైనా ఇంత వరకు పనులు ప్రారంభించకపోవడంపై గ్రామస్థులు మండిపడుతున్నారు.
నిజామాబాద్ జిల్లా:
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఉగ్ర కదలికలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి... బోధన్‌లో తలదాచుకున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరోవైపు బోధన్ ప్రజలను పోలీసులు అలర్ట్ చేశారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు .