కరోనా అదుపులోకొస్తే ఇంటర్ ప్రవేశాలు
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను మరిన్ని రోజులు పెంచిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను మరిన్ని రోజులు పెంచిన విషయం తెలిసిందే. కాగా రాష్ట్రంలో ఇప్పటికే జరగాల్సిన పదో తరగతి, డిగ్రీ, ఇతర ప్రవేశపరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. ఇక ఇంటర్మీడియట్ విషయానికొస్తే పరీక్షలు పూర్తయినప్పటికీ మూల్యాంకణం మాత్రం జరగకుండా ఆగిపోయింది. దీంతో ఇంటర్ పరీక్ష ఫలితాలు కూడా రాకుండా నిలిచిపోయాయి. ఈ పరిణామాలతో వచ్చే విద్యాసంవత్సరం ఈ సారి రెండు నెలలు ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా ఇంటర్మీడియెట్ తరగతులు. ఇంకా పదో తరగతి పరీక్షలు పూర్తి కానందున ఇంటర్మీడియెట్ తరగతులు కాస్త ఆలస్యంగానే ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలో కరోనా వైరస్ జూన్ రెండో వారంలోగా కరోనా అదుపులోకి వస్తేనే ఆగస్టు నుంచి ప్రథమ సంవత్సర తరగతులు ప్రారంభమయ్యే అవకాశముంది. లేని పక్షంలో ఇంకా ఆలస్యం కాక తప్పదు. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు, మూల్యాంకనం, ఫలితాల వెల్లడి, ఇంటర్మీడియట్ ప్రవేశాలు, ఆ తరువాత చేపట్టాల్సిన కార్యాచరణపై బోర్డు నియమించిన అధికారుల కమిటీ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఈ రోజో రేపో ఈ నివేదికను బోర్డుకు అందజేయనుంది.
ఇక మార్చి 19న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు 22 వరకు జరిగాయి. ఆ తరువాత రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో మార్చి 23 నుంచి 29 వరకు జరగాల్సిన పరీక్షలను హైకోర్టు ఆదేశాలతో వాయిదా వేసారు. కాగా మిగిలిన పరీక్షలను మార్చి 31 నుంచి ఏప్రిల్ 6 వరకు నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపినప్పటికీ రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగడంతో పరీక్షలు మరోసారి వాయిదా వేసారు. ప్రస్తుతం కరోనా కేసులు సంఖ్య తక్కువగా నమోదవుతుండడంతో లాక్ డౌన్ తీసేస్తే పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఒక వేళ పరీక్షలు నిర్వహించినప్పటికీ ప్రతి రూమ్ లో కేవలం 12 మంది విద్యార్థులు మాత్రమే ఉండేటట్లు ఏర్పాట్లు చేయనున్నారు. విద్యార్థి విద్యార్థికి దూరం 6 అడుగుల దూరం పాటించే విధంగా చూడనున్నారు. భౌతిక దూరం పాటిస్తూ పరీక్షల నిర్వహించనున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న సెంటర్ ల కంటే ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.