Telangana: విద్యుత్ స్మార్ట్ మీటర్స్ అమర్చే ఆలోచనలో టీఎస్ సర్కార్
Telangana: తొలుత హైదరాబాద్‌లోని ప్రభుత్వ కార్యాలయాల్లో అమర్చే ఛాన్స్
Telangana: విద్యుత్‌లో మంచి పురోగతి సాధించిన తెలంగాణ స్మార్ట్ మీటర్స్ అమర్చే ఆలోచన చేస్తోంది. మొదటగా హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు కొన్ని ప్రైవేట్ ఆఫీసుల్లో స్మార్ట్ మీటర్స్ పెట్టాలని విద్యుత్ శాఖ భావిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత విద్యుత్ సరఫరాలో మంచి పురోగతి సాధించామని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే.. కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చేయాలని టీఎస్ సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ఇతర కార్యాలయాల్లో మొత్తం 28 వేల 800 స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
రాష్ట్రం ఏర్పడక ముందు విద్యుత్ ఎనర్జీ లాస్ 18.5 శాతం ఉండేది.. కానీ తెలంగాణ వచ్చాక 10 శాతానికి తగ్గింది. అంతేకాకుండా.. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పన, ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ చూసినా, లో ఓల్టేజ్ తో బోరు మోటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కలిపోయేవని, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎక్కడ లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా కోటికి పైచిలుకు గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వాటి అన్నింటికీ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం వలన వేల కోట్ల భారం పడుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న సబ్సిడీ 15 శాతం నుంచి 50, 60 శాతానికి పెంచితే అన్ని గ్రామాల్లో ఈ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు సాధ్యం అవుతుందని అభిప్రాయపడుతున్నారు అధికారులు.
రాష్ర్టాల్లోని అన్ని ప్రభుత్వ భవనాలకు స్మార్ట్ ప్రీ పెయిడ్ మీటర్ల ఏర్పాటును 2023 డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. దీంతో.. కేంద్ర ప్రభుత్వ సూచనలతో తొందరలోనే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్ మీటర్స్ అమర్చాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. దీనిపై విద్యుత్ శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా సెల్‌ఫోన్లు, డీటీహెచ్‌లాగా స్మార్ట్ ప్రీ పెయిడ్ మీటర్లను ఆన్‌లైన్‌లో రీఛార్జ్ చేసుకునేలా రూపొందించారు. దీనికి సంబంధించిన ఓ కార్డును మీటర్లో పెడితే అప్పటివరకు ఎంత విద్యుత్తు వాడారు..? ఎంత బ్యాలెన్స్ ఉంది? అనే వివరాలు మీటర్లలోని మానిటర్ పై చూపిస్తుంది. కార్డుపై రీచార్జ్ చేసిన డబ్బు అయిపోగానే విద్యుత్ సరఫరా ఆగిపోతుంది. పేటీఎం, బిల్ డెస్క్, టీ వాలెట్ యాప్‌ల ద్వారా స్మార్ట్ మీటర్స్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు.