కిషన్.. పరేషాన్..!.. దెబ్బ మీద దెబ్బ కొడుతున్న సీనియర్ నేతలు
Kishan Reddy: రాజీనామా చేసిన అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి
Kishan Reddy: తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బీజేపీకి వరుస షాకులు ఇస్తున్నారు కమలం నేతలు.. ఏళ్లుగా పార్టీలో ఉన్న సీనియర్ నేతలు సైతం.. టికెట్ దక్కలేదనే ఆగ్రహంతో బీజేపికి రాజీనామా చేస్తున్నారు. ఓ వైపు ఒకరిద్దరు మాత్రమే పార్టీలో చేరుతుంటే.. మరో వైపు అంతకు రెట్టింపు నాయకులు పార్టీని వీడుతున్నారు... కారణాలేమయినా కమలం పార్టీ రాష్ట్ర రథసారథి కిషన్ రెడ్డి మాత్రం ఎందుకు మౌనం వహిస్తున్నారో అంతుచిక్కడం లేదు. బీజేపీలో సీనియర్ నేతలు పార్టీని వీడుతుండడంతో కిషన్ రెడ్డి పరేషాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయినా వారిని బుజ్జగించేందుకు కనీసం ప్రయత్నించడం లేదు.
ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ... కమలం పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. పలువురు కీలక నేతలు ఒకరి తర్వాత ఒకరు బీజేపీకి గుడ్ బై చెబుతున్నారు. కాగా వారి బాటలోనే మరికొందరు సీనియర్లు సైతం రాజీనామా బాట పట్టనున్నట్లు సమాచారం. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో... ఇతర పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు బీజేపీలో చేరారు. తమకు పార్టీలో సరైన ప్రాధాన్యం లభించడం లేదనే సాకుతో ప్రస్తుతం వారంతా... ఒకరి తర్వాత ఒకరు పార్టీని వదులుతున్నారు. వారి బాటలోనే మరికొందరు సీనియర్ నేతలు కూడా పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీని వీడుతున్న నేతలను కనీసం బుజ్జగించేందుకయినా కిషన్ రెడ్డి కాలు కదపడం లేదని కమలం పార్టీ శ్రేణులు అంటున్నారు.
పలువురు సీనియర్ నేతలు అసెంబ్లీ బరిలో నిలిచేందుకు వెనక్కు తగ్గారు. తాము లోక్‌సభ బరిలో నిలుస్తామని వీరంతా చెబుతున్నప్పటికీ... ఓటమి భయమే అసలు కారణంగా తెలుస్తోంది. పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు డీకే అరుణ... తాను అసెంబ్లీ బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు. మరో ముఖ్యనేత, తెలంగాణ ఫైర్ బ్రాండ్‌గా పేరు పొందిన విజయశాంతి బీజేపీ నాయకత్వంపై ఎప్పటి నుంచో గుర్రుగా ఉన్నారు. ఆమె ట్విట్టర్ వేదికగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు పదవులపై ఆశ లేదని, ఎప్పుడూ తాను పదవులు కోరుకోలేదని చెప్పారామె.... కేసీఆర్ కుటుంబం అవినీతి, పలువురు నేతల ఒంటెద్దు పోకడలు తప్ప తనకు బీఆర్‌ఎస్‌పై ఎలాంటి కోపం లేదన్నారు. ఈ వాఖ్యల నేపథ్యంలో ఆమె పార్టీ మారుతున్నారనే సందేహం కలుగుతోంది. తాను పార్టీ మారుతానని ట్విట్టర్ వేదికగా చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది.
మరో సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళుతున్నారన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతోపాటు ఇటీవల పార్టీలోని పలువురు సీనియర్ నేతలతో విశ్వేశ్వర్ రెడ్డికి విభేదాలు తలెత్తాయని తెలుస్తోంది. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో పలు అసెంబ్లీ టికెట్లపై డాక్టర్ లక్ష్మణ్ వేలు పెడుతున్నారని విశ్వేశ్వర్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యంగా తన పార్లమెంట్ పరిధిలోని పరిగి, శేరిలింగంపల్లిలో కొండా వర్గీయులకు కాకుండా.. తన వారికి టికెట్ ఇప్పించుకోవాలని డాక్టర్ లక్ష్మణ్ ప్రయత్నిస్తున్నారు.
దీంతో కొండా అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, అగ్రనేత రాహుల్ గాంధీతోనూ విశ్వేశ్వర్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకటి లేదా రెండు రోజుల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి కూడా పార్టీని వీడిపోయారు. అయినా కిషన్ రెడ్డి ఏమాత్రం స్పందించడం లేదు.. సీనియర్లు పార్టీని వీడుతున్నారని కిషన్ రెడ్డికి సమాచారం ఉన్నా.. ఎందుకు మౌనం వహిస్తున్నారోనని కమలనాథులు అంటున్నారు.
ఇప్పటికే బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటేనన్న విషయం కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ప్రచారంలోకి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో బీజేపీకి పలు స్థానాల్లో అభ్యర్థులు దొరకడం లేదన్న విమర్శ కూడా ఉంది. ఇప్పటికే బీజేపీ కీలకమైన మెజార్టీ స్థానాల బరి నుంచి వెనక్కి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. 10 నుంచి 15 స్థానాలు సాధిస్తే.. హంగ్ వచ్చే అవకాశాలుంటే... తాము కీలక రోల్ దక్కించుకోవచ్చన్న ఆలోచనలో ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రచార సందర్భంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు ఆ పార్టీని లెక్కలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది. మండల, గ్రామ స్థాయి బీజేపీ నాయకులను తమ పార్టీ వైపు లాక్కునేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కింది స్థాయి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
వలసలతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న తెలంగాణ బీజీపీకి అగ్రనేతలు షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తాము పోటీ చేయమని అధిష్టానానికి స్పష్టం చేశారు. తాజాగా మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. కొన్ని రోజులుగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డీకే అరుణ పోటీ చేయడం లేదని పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై డీకే అరుణ క్లారిటీ ఇచ్చారు.
తన స్థానంలో బీసీ అభ్యర్థిని బరిలోకి దింపుతామని ప్రకటించారు. ఈసారి కూడా ఆమె గద్వాల్ నుంచి బరిలోకి దిగుతారని ప్రచారం జరగగా.. డీకే అరుణ మాత్రం పోటీకి దూరంగా ఉంటూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని అధిష్టానానికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కీలక నేతలు బరిలో నుంచి తప్పుకోవడంతో ఓటర్లకు తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న భావన పార్టీ నేతలు, శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.
తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. తన కార్యకర్తలతో కలిసి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ పార్టీలో సిద్ధాంతలు లేవని.. పైరవీకారులకు టిక్కెట్లు ఇచ్చారని ఆరోపించారు. పనిచేసే నేతలు, ప్రశ్నించే వాళ్ల గొంతు నొక్కారని ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ ఇవ్వకపోగా కనీసం పలకరించడం లేదని బాధపడ్డారు. రాజీనామా సందర్భంగా భావోద్వేగానికి గురై రాకేశ్ రెడ్డి కంటతడి పెట్టారు. రాకేష్ రెడ్డి వరంగల్ వెస్ట్ టికెట్ ఆశించగా.. బీజేపీ మాత్రం ఆ సీటును పార్టీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మారెడ్డికి ఇచ్చారు. దీంతో రాకేష్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురై బీజేపీ రాజీనామా చేశారు. బీజేపీకి రాజీనామా చేసిన రాకేష్ రెడ్డి .. ఏ పార్టీలో చేరుతారో చూడాలి.
మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కీలక నేత పీసీస ప్రధాన కార్యదర్శి చలమల్ల కృష్ణారెడ్డి ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీ కండువాను కప్పుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి కాంగ్రెస్ టికెట్ తనకే వస్తుందని భావించారు. కానీ చివరి నిమిషంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయనకే అధిష్టానం టికెట్ కేటాయించింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన చలమల కృష్ణారెడ్డి బీజేపీ పార్టీ ముఖ్యనాయకులతో చర్చలు జరిపి మునుగోడు టికెట్ కేటాయింపు హామీతోనే ఢిల్లీలో ఆ కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు సమాచారం. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.