Delimitation: డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి... అసలు డిమాండ్ ఏంటంటే...
Delimitation: డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి... అసలు డిమాండ్ ఏంటంటే...
Revanth Reddy about delimitation: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం చేపట్టనున్న డీలిమిటేషన్ విధానానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. జనాభా ప్రాతిపదికన కాకుండా రాష్ట్రాలను యూనిట్స్ వారీగా తీసుకుని డీలిమిటేషన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. "దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసి, కేంద్రం విధించిన లక్ష్యాలను అందుకోవడంలో విజయం సాధించాయి. దాంతో ఉత్తరాదిన జనాభా భారీగా పెరిగిపోయిందని, దక్షిణాదిని జనాభా పెరుగుదల పూర్తిగా అదుపులోకి వచ్చింది" అని అన్నారు. ఇలాంటి సందర్భంలో జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు.
మొత్తం దేశ జనాభాలో దక్షిణాది రాష్ట్రాల జనాభా 24 శాతమే ఉందని చెబుతూ ఆ సంఖ్యతో వచ్చే లోక్ సభ స్థానాలతో దక్షిణాది రాష్ట్రాలు తమ హక్కులను సాధించుకోలేవు అని అన్నారు. తమిళనాడు సీఎం ఎం.కే. స్టాలిన్ కూడా డీలిమిటేషన్ అంశాన్ని వ్యతిరేకిస్తూ దక్షిణాది రాష్ట్రాల నేతలతో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేశారని సీఎం రేవంత్ రెడ్డి సభలో గుర్తుచేశారు.
డీలిమిటేషన్‌పై వస్తున్న విమర్శలను కొంతమంది కేంద్రమంత్రులు, బీజేపి నేతలు ఖండిస్తుండటంపై కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. అసలు కేంద్రం నిర్ణయం తీసుకోకముందే రాజకీయం చేయడం ఎందుకని కేంద్రమంత్రులు, బీజేపి నేతలు అంటున్నారు. కానీ జనాభా ప్రాతిపదికన చేసే డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలు ఎంత నష్టపోతాయో కేంద్రానికి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా తెలంగాణ ప్రజలకే కాదు... కేంద్రానికి కూడా తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలనేదే తమ ఉద్దేశం అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
ఇందిరా గాంధీ బాటలోనే వాజ్‌పెయి వెళ్లారు... కానీ
1975 లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా పార్లమెంట్ నియోజకవర్గాల విషయంలో పాత సంఖ్యనే కొనసాగించారు. అలాగే 2002 లో అప్పటి ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి కూడా అదే విధానాన్ని కొనసాగిస్తూ మరో 25 ఏళ్లు అదే సంఖ్యను పొడిగించారు. కానీ మోదీ ఆ ఆలోచనలో లేరని రేవంత్ రెడ్డి అన్నారు.
11 ఏళ్లుగా మోదీ ఆ చట్టాన్ని అమలు చేయడం లేదన్న రేవంత్ రెడ్డి
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలను 153కి పెంచాలని, ఏపీలో ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాలను 225 వరకు పెంచాలని ఉంది. పార్లమెంట్‌లోనే చేసిన ఈ చట్టాన్ని మోదీ సర్కారు అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు అవుతున్నా ఇప్పటి వరకు ఆ పని చేయలేదు. వారికి దక్షిణాదిపై ఉన్న ఆసక్తి ఏంటో చెప్పడానికి ఈ ఒక్క విషయమే చాలు అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
Delimitation Explainer: డీలిమిటేషన్‌తో ఎవరికి ఎక్కువ లాభం? ఎవరికి ఎక్కువ నష్టం?