Hyderabad Rain Alert: హైదరాబాద్‌లో రాత్రంతా కుంభవృష్టి..నేడు కూడా హై అలర్ట్
Hyderabad Rain Alert: హైదరాబాద్ లో గురువారం భారీ వర్షం కురిసింది. దీంతో నగరవాసులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చార్మినార్ కు సంబంధించిన ఆందోళనకరమైన ఘటనతోపాటు వాతావరణశాఖ హెచ్చరికలు, జీహెచ్ఎంసీ చర్యలు నేడు వాతావరణ స్థితిగతుల గురించి తెలుసుకుందాం.
ఏప్రిల్ 3 గురువారం హైదరాబాద్ లో సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చింది. మళ్లీ మొదలై రాత్రి 3గంటల వరకు కురిసింది. హిమాయత్ నగర్ లో 7.5సెంటీమీటర్లు, చార్మినార్ ప్రాంతంలో 7.2 సెంటీమీటర్లు షేక్ పేటలో 7.1సెంటీమీటర్లు బాలానగర్ లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. ఈ వర్షం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులతో కూడి ఉండటంతో నగరంలో అల్లకల్లోలం రేపింది. ఐఎండీ ప్రకారం మరాఠ్వాడా, మధ్య మహారాష్ట్రపై ఏర్పడిన సైక్లోనిక్ సర్క్యూలేషన్ ఈ వర్షాలకు కారణమని వాతావరణ శాఖ తెలిపింది.
భారీ వర్షం వల్ల హైదరాబాద్‌లో రోడ్లు చెరువులను తలపించాయి. మలక్‌పేట్ రైల్వే బ్రిడ్జి కింద, దిల్‌సుఖ్‌నగర్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలైన అంబర్‌పేట్, ముషీరాబాద్, చంద్రాయణగుట్ట ప్రాంతాలు జలమయం అయ్యాయి. చాలా చోట్ల చెట్లు నేలకూలడంతో వాహనాలు దెబ్బతిన్నాయి. చెట్ల కొమ్మలు రోడ్లపై ట్రాఫిక్‌కి అంతరాయం కలిగించాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి, కొన్ని ప్రాంతాల్లో గంటల తరబడి కరెంటు లేకుండా పోయింది.
భారీ వర్షం వల్ల చార్మినార్ ఈశాన్య మినార్ నుంచి రాళ్లు, సున్నం పెచ్చులు ఊడాయి. ఈ సంఘటన సాయంత్రం 5:30 గంటల సమయంలో జరిగింది. భాగ్యలక్ష్మి ఆలయం వైపు ఈ శిథిలాలు పడటంతో అక్కడున్న పర్యాటకులు భయంతో పరుగులు పెట్టారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అధికారులు వెంటనే స్పాట్‌కు చేరుకుని నష్టాన్ని అంచనా వేశారు. "మినార్‌కు పెద్ద ప్రమాదం లేదన్నారు. త్వరలో మరమ్మతులు ప్రారంభిస్తాం" అని ASI అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటన చార్మినార్ సంరక్షణపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది.