బట్టతలపై జుట్టు మొలిపిస్తానన్నాడు... ఆ లోషన్ పూసుకున్న వాళ్లు హాస్పిటల్‌లో చేరారు

Update: 2025-04-10 11:47 GMT

బట్టతలపై జుట్టు మొలిపిస్తానన్నాడు... ఆ లోషన్ పూసుకున్న వాళ్లు హాస్పిటల్‌లో చేరారు

Hair regrowth treatment landed people in hospitals: జుట్టు రాలడం, బట్ట తల అనేది ఇటీవల కాలంలో చాలామందిలో కనిపిస్తోన్న సమస్య. ఒకప్పుడు వయసైపోయిన వారికే బట్ట తల వచ్చేది. కానీ ఇప్పుడున్న జనరేషన్‌లో పౌష్టికాహారం లేకపోవడం, పైగా కల్తీ ఆహారం తీసుకోవడం, మానసిక ఒత్తిళ్ల వల్ల అనేక మందిలో చిన్న వయస్సులోనే ఈ సమస్య కనిపిస్తోంది. దీంతో చాలామందికి ఈ బాల్డ్ హెడ్ సమస్య అనేది పెద్ద హెడెక్ అయిపోయింది.

జట్టు ఊడకుండా ఉండటం కోసం, ఊడిన జుట్టు మళ్లీ రావడం కోసం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ భారీ మొత్తంలో డబ్బులు తగలేసే వారు కూడా భారీ సంఖ్యలోనే ఉన్నారు. అలాంటి వారిని బురిడి కొట్టించి డబ్బులు దండుకునే వారు కూడా అంతే భారీ సంఖ్యలో ఉన్నారు. ఎవరేం చెప్పినా సరే, ఎవరు ఏ మెడిసిన్ ఇచ్చినా సరే, జుట్టు పెరుగుతుందనే ఆశతో వారు ఇచ్చిన మెడిసిన్ తీసుకుని మోసపోతున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది.

తాజాగా హైదరాబాద్ పాత బస్తీలో అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. టైమ్స్ నౌ కథనం ప్రకారం ఢిల్లీకి చెందిన వకీల్ సల్మానీ అనే వ్యక్తి హైదరాబాద్ ఫతే దర్వాజ రోడ్డులో బిగ్ బాస్ సెలూన్‌ పేరుతో ఒక సెలూన్ రన్ చేస్తున్నాడు. జుట్టు ఊడిపోయే వారికి తిరిగి జుట్టును మొలిపించేందుకు తన వద్ద ఒక అద్భుతమైన ఫార్ములా ఉందని అందరినీ నమ్మించాడు. ఆ న్యూస్ నగరం నలు దిక్కుల వ్యాపించింది. 500 పైగా కస్టమర్స్ సల్మానీ షాపు ఎదుట క్యూ కట్టారు.

చికిత్స ఏంటంటే...

జుట్టు పెరిగే మెడిసిన్ కోసం తన వద్దకు వచ్చే కస్టమర్స్‌కు సల్మానీ ముందుగా నున్నగా గుండు కొడుతాడు. తరువాత వారి తలపై ఒక బ్రష్ సహాయంతో ఒక తెల్లటి లోషన్ అప్లై చేశాడు. మూడు రోజుల వరకు సబ్బు కానీ లేదా షాంపు, హెయిర్ ఆయిల్ వంటివి ఏవీ పెట్టవద్దని చెప్పాడు. లేదంటే తను పూసిన లోషన్ సరిగ్గా పనిచేయదు అని చెప్పడంతో వారు కూడా అతడు చెప్పినట్లే విన్నారు. కానీ వారిలో కొంతమందిని తీవ్రమైన తలనొప్పి వేధించడం మొదలుపెట్టింది. ఇంకొంతమందికి ఇతర ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. దాంతో వారు ఆస్పత్రులకు పరుగెత్తాల్సిన దుస్థితి తలెత్తింది.

సల్మానీ వద్ద చికిత్స తీసుకున్న వారు మళ్లీ అతన్ని వెతుక్కుంటూ రావడం మొదలుపెట్టారు. ఫిర్యాదులు ఎక్కువ అవడంతో సల్మానీ దుకాణం బంద్ చేసి కనిపించకుండా పోయాడు. ప్రస్తుతం సల్మానీ బాధితులు అంతా అతడి ఆచూకీ కోసం వెదుకుతున్నారు.

ఇలాంటి విషయాల్లో శాస్త్రీయ ఆధారాలు లేనిదే ఎవరు ఏది చెబితే అది గుడ్డిగా నమ్మి మోసపోవద్దని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఎవరైనా తెలియకుండా ఎదుటి వ్యక్తి చేతుల్లో మోసపోయినప్పుడు, 'నున్నగా గుండు కొట్టించి పంపించారు' అని అంటుంటారు. కానీ పాపం సల్మానీ నిజంగానే వారికి గుండు కొట్టి పంపించాడు కదా!!

Full View

Most read interesting stories: ఎక్కువమంది చదివిన ఆసక్తికరమైన వార్తా కథనాలు

Tags:    

Similar News