
SC Classification Act: తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం నేటి నుంచి అమలు కానుంది. దాదాపు 30ఏళ్ల పాటు వర్గీకరణ కోసం జరిగిన పోరాటానికి ప్రతిఫలంగా అమల్లోకి తీసుకువస్తూ ఉత్తర్వులు, నిబంధనలు జారీకానున్నాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజు వర్గీకరణ అమలు తేదీగా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.
ఉత్తర్వుల తొలి కాపీని సీఎం రేవంత్ రెడ్డికి అందించాలని ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తుది సమావేశంలో నిర్ణయించింది. నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటు అయిన మంత్రివర్గ ఉపసంఘం హైదరాబాద్ లో సమావేశం అయ్యింది. ఆ భేటీకి మంత్రులు దామోదర రాజనర్సింహా, సీతక్క, పొన్నం ప్రభాకర్, ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ సహా పలువురు అధికారులు హాజరు అయ్యారు.
సీఎం రేవంత్ రెడ్డి నేత్రుత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్దాల కాలం నాటి డిమాండ్ నెరవేర్చిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గతంలో అనేక ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా తీర్మాణాలు ఆమోదించినా, చట్టపరమైన మద్దతుతో అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మద్దతు ఇచ్చారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నేడు వర్గీకరణ ఉత్తర్వులు, విధివిధానాలు జారీ చేస్తామని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.