Aghori arrested: అఘోరి అరెస్ట్, పూజ పేరుతో 9 లక్షల హాంఫట్.. మరి వర్షిణి సంగతేంటి?

Aghori arrested by Hyderabad Police: తెలుగు రాష్ట్రాల్లో పూజల పేరుతో గుళ్లు గోపురాల చుట్టూ తిరుగుతూ హల్చల్ చేస్తోన్న అఘోరిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలె శ్రీవర్షిణి అనే యువతిని ఒక ఆలయంలో పెళ్లి చేసుకున్న వ్యవహారంలో అఘోరి పేరు వార్తల్లోకెక్కింది. అఘోరి తీరుపై అసలు సాధువులు ఆందోళన వ్యక్తంచేస్తూ అతడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయడం తెలిసిందే. మరింత మంది యువతుల జీవితాలతో ఆడుకోకుండా అఘోరిగా చెప్పుకుని తిరుగుతున్న అతడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా సాధువులు డిమాండ్ చేశారు.
అఘోరి శ్రీవర్షిణిని పెళ్లి చేసుకున్నట్లు తెలిసిన తరువాత మరో యువతి కూడా మీడియా ముందుకొచ్చారు. శ్రీవర్షిణి కంటే ముందుగా అఘోరి తనను పెళ్లి చేసుకున్నాడని ఆమె ఆరోపించారు. తనలా, శ్రీ వర్షిణిలా మరో యువతిని పెళ్లి చేసుకుని మోసం చేయక ముందే అఘోరిని అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ యువతి కోరారు.
ఇవన్నీ ఇలా ఉంటే, తాజాగా అఘోరిని హైదరాబాద్ శివారులోని మోకిల పోలీసులు ఒక చీటింగ్ కేసులో అరెస్ట్ చేశారు. ప్రత్యేక పూజల పేరుతో అఘోరి తన వద్ద రూ. 9 లక్షలు తీసుకున్నాడని ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అఘోరిని అదుపులోకి తీసుకున్నారు. అఘోరిపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఇలా ఎంత మంది వద్ద డబ్బులు తీసుకున్నాడు, ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నాడు అనే కోణంలో పోలీసులు అఘోరిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
శ్రీవర్షిణి తల్లిదండ్రులు కూడా ఆమె రక్షణపై ఆందోళన వ్యక్తంచేస్తూ పోలీసులును ఆశ్రయించారు. దీంతో వాస్తవానికి శ్రీవర్షిణిని రెండో పెళ్లి చేసుకున్న కేసులోనే అఘోరిని అరెస్ట్ చేస్తారని అంతా భావించారు. కానీ ప్రత్యేక పూజల పేరుతో ఒక వ్యక్తి వద్ద రూ. 9 లక్షలు వసూలు చేసిన కేసులో పోలీసులు అఘోరిని అరెస్ట్ (Aghori arrested) చేశారు.