Hyderabad: వేలానికి గోల్కోండ బ్లూ డైమండ్.. ఎన్ని కోట్లు పలకనుందో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..!
Golconda Blue Diamond: తెలంగాణ గోల్కొండ గనుల్లో వెలికితీసిన అరుదైన నీలి వజ్రం ‘ది గోల్కొండ బ్లూ’ త్వరలో వేలానికి రానుంది.

Hyderabad: వేలానికి గోల్కోండ బ్లూ డైమండ్.. ఎన్ని కోట్లు పలకనుందో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..!
Golconda Blue Diamond: తెలంగాణ గోల్కొండ గనుల్లో వెలికితీసిన అరుదైన నీలి వజ్రం ‘ది గోల్కొండ బ్లూ’ త్వరలో వేలానికి రానుంది. ప్రపంచ ప్రఖ్యాత ఆక్షన్ సంస్థ క్రిస్టీ, మే 14న స్విట్జర్లాండ్ జెనీవాలో దీనిని వేలం వేయనుంది. సుమారు 23.24 కారెట్ల ఈ విలువైన వజ్రం ధర రూ.300 కోట్ల నుంచి రూ.430 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇది ఇప్పటి వరకు ఏ వేలంలోనూ ఉంచలేదు. అందుకే ఈ వజ్రం ఎవరిచేతకు వెళ్లబోతుందన్న ఉత్కంఠ అన్ని వర్గాల్లోనూ నెలకొంది.
ఈ వజ్రం ప్రత్యేకత ఏంటంటే?
'ది గోల్కొండ బ్లూ' వజ్రం నీలి మెరుపుతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది భారత రాజవంశాల వైభవానికి ప్రతీకగా నిలిచింది. దాదాపు 259 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వజ్రం ఇండోర్, బరోడా రాజవంశాలతో ముడిపడి ఉంది. 1923లో ఇండోర్ మహారాజు 2వ యశ్వంత్ రావ్ హోల్కర్ తండ్రి, ఫ్రాన్స్‌కి చెందిన ఛామెట్ అనే ఆభరణాల సంస్థతో ప్రత్యేకంగా బ్రెస్‌లెట్ తయారు చేయించారు. అందులో ఈ వజ్రాన్ని పొదిగారు.
తరువాత, యశ్వంత్ రావ్ గైక్వాడ్ ఈ వజ్రాన్ని మరో రెండు గోల్కొండ వజ్రాలతో కలిపి ఓ నెక్లెస్ తయారు చేయించారు. ఆ మణిహారం ఇండోర్ మహారాణి అలంకరించిన సమయంలో అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఫ్రెంచ్ కళాకారుడు బెర్నాడ్ బూటే దీ మోన్వెల్, ఆ మణిహారం ధరించిన ఆమె చిత్రాన్ని ఆవిష్కరించారు.
మళ్లీ వెలుగులోకి
ఈ వజ్రం తరువాత అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన హారీ విన్సట్ జువెలర్స్ వద్దకు చేరింది. అక్కడ దీన్ని ‘బ్రూచ్’ అనే మరో ఆభరణంగా తీర్చిదిద్దారు. తర్వాత బరోడా మహారాజు దీన్ని కొనుగోలు చేశారు. అక్కడి నుంచి ఇది ప్రైవేట్ కలెక్షన్‌లోకి వెళ్లిపోయి చాలాకాలం పాటు వెలుగులోకి రాలేదు. అయితే ఇప్పుడు వేలం కారణంగా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ వజ్రం జీవితంలో ఒక్కసారి వచ్చే అరుదైన అవకాశం అని క్రిస్టీ సంస్థ పేర్కొంది. గోల్కొండ గనుల్లో జన్మించిన ఈ నీలి వజ్రం ప్రపంచంలో అత్యంత విలువైన వాటిలో ఒకటిగా చెబుతోంది.