IPO Fraud: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరు చెప్పి రూ. 2.8 కోట్లు కుచ్చుటోపీ

Update: 2025-04-27 11:57 GMT
IPO Fraud: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరు చెప్పి రూ. 2.8 కోట్లు కుచ్చుటోపీ
  • whatsapp icon

Hyderabad man loses Rs 2.8 cr in IPO scam: హైదరాబాద్ ఆసిఫ్ నగర్‌కు చెందిన 37 ఏళ్ల యువకుడు సైబర్ క్రిమినల్స్ చేతికి చిక్కి దారుణంగా మోసపోయారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరు చెప్పి ఆ యువకుడి నుండి రూ. 2.8 కోట్లు దోచుకున్నారు. అంతటితో ఆగకుండా మరిన్ని డబ్బులు కట్టాల్సిందిగా ఒత్తిడి తెస్తుండటంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తరువాతే ఈ దారుణ మోసం వెలుగులుకొచ్చింది.

ఆసిఫ్ నగర్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం సైబర్ క్రిమినల్స్ ఆ యువకుడికి ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా గాలం వేశారు. ఐపీఓలకు అందరికంటే ముందే యాక్సెస్ కల్పిస్తామని చెప్పి కనిపించిన ఓ ఫేస్ బుక్ పోస్టుపై యువకుడు క్లిక్ చేశారు. అక్కడి నుండి సైబర్ క్రిమినల్స్ నిర్వహిస్తోన్న ఒక ఫేక్ ఐపీఓ సైట్ కు రీడైరెక్ట్ అయింది. ఆ తరువాత యువకుడి ఫోన్ నెంబర్ ఒక వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేశారు. అక్కడ గ్రూప్ లో ఉన్న వారంతా ఐపీఓల గురించే మాట్లాడుకుంటున్నట్లు, చాట్ చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చారు. అది చూసిన యువకుడు తను చూస్తున్నదంతా నిజమేనని భావించారు.

ఆ తరువాత ప్రియ అనే పేరుతో పరిచయం చేసుకుంటూ ఒక యువతి లైన్‌లోకి వచ్చింది. ASKMIN అనే యాప్ ద్వారా ఆ యువకుడు పెట్టుబడులు పెట్టేందుకు ఆమె అతడిని ఒప్పించింది. ఆ యువతి చెప్పినట్లుగానే మార్చి 7వ తేదీ నుండి ఏప్రిల్ 21వ తేదీ వరకు వివిధ మొత్తాలలో మొత్తం రూ. 2.8 కోట్లు పెట్టుబడి పెట్టారు. యువకుడిని మరింత నమ్మించడం కోసం అతడి పెట్టుబడిపై రూ. 4.9 లక్షలు లాభం వచ్చిందంటూ అతడి బ్యాంక్ ఖాతాకు డబ్బులు బదిలీ చేశారు.

ఆ తరువాతే అసలు మోసం బయటపడింది. తన పెట్టుబడిని విత్ డ్రా చేసుకుంటానని ప్రయత్నించగా అందుకు ఆస్క్‌మినీ యాప్ అంగీకరించలేదు. అదేమని నిర్వాహకులను నిలదీస్తే, మరో 15 శాతం ప్రాసెసింగ్ ఫీజు చెల్లిస్తేనే ఆ విత్ డ్రావల్ సాధ్యం అవుతుందని చెప్పారు. ASKMIN యాప్ లో రూ 32.3 కోట్లు నగదు ఉందని, కానీ ప్రాసెసింగ్ ఫీజు చెల్లిస్తేనే మీ డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి వీలు ఉంటుందని డిమాండ్ చేశారు. దీంతో నిర్వాహకులపై అనుమానం వచ్చిన ఆ యువకుడు తను మోసపోయానని గ్రహించారు. తను పెట్టుబడి పెట్టిన డబ్బుల్లోంచే తనకు లాభం వచ్చిందని నమ్మించారు అని అర్థం చేసుకున్న యువకుడు శనివారం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Tags:    

Similar News