
IMD predicts heavy rains in Telangana: తెలంగాణలో ఈ శని, ఆదివారాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో ఏకంగా ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇంకొన్ని జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
ఆరెంజ్ అలర్ట్ జారీ అయిన జిల్లాలు - భారీ నుండి అతి భారీ వర్షాలకు సంకేతం
ములుగు, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. ఆరెంజ్ అలర్ట్ జారీ అయిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉంది.
ఎల్లో అలర్ట్ జారీ అయిన జిల్లాలు - ఓ మోస్తరు నుండి భారీ వర్షాలకు సంకేతం
ఆసిఫాబాద్, కుమ్రం భీమ్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. అంతేకాకుండా హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఎల్లో అలర్ట్ జారీ అయిన జిల్లాల్లో గంటకు 40 - 50 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని... అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు.
కొన్నిసార్లు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయడం జరుగుతుంది. రెడ్ అలర్ట్ జారీ చేయడం అంటే ఎడతెరిపి లేకుండా అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించడం లాంటిది.
ఇప్పటికే అకాల వర్షాలతో తెలంగాణ వ్యాప్తంగా భారీ సంఖ్యలో రైతులు ఎంతో నష్టపోయారు. కొంతమంది రైతులు వరి కోయకముందే వర్షాలకు నేల రాలిన పంటలతో నష్టపోయారు. ఇంకొంతమంది రైతులు మార్కెట్ యార్డుల్లో, కల్లంలో ఉన్న ధాన్యం వర్షంలో కొట్టుకుపోయి, తడిసి నష్టపోయారు. మామిడి తోటల రైతులు కూడా ఈ అకాల వర్షాలతో కాత నేల రాలి భారీ ఎత్తున నష్టపోయారు.