TG SSC Results: తెలంగాణలో 10వ తరగతి ఫలితాలకు లైన్ క్లియర్.. మెమొలో మార్కులకు గ్రీన్ సిగ్నల్
TG 10th class Results: తెలంగాణ 10వ తరగతి ఫలితాల విడుదల తేదీ ఎప్పుడా అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వేచిచూస్తున్నారు

Telangana 10th class results 2025: తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఉన్న అడ్డంకి తొలగిపోయింది. ఇప్పటివరకు పదో తరగతి ఫలితాలను సబ్జెక్టుల వారీగా మార్కులను వెల్లడించకుండా గ్రేడ్స్ ఇచ్చేవారు. అన్నీ కలిపి క్యూములేటివ్ గ్రేడ్స్ కూడా ఇచ్చేవారు. కానీ ఈ విద్య సంవత్సరం నుండి టెన్త్ క్లాస్ మెమోపై సబ్జెక్టుల వారీగా మార్కులు కూడా ముద్రించనున్నారు.
గ్రేడ్స్‌తో పాటు మార్కులు కూడా వెల్లడించే పద్ధతికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ పాఠశాల విద్యా శాఖ వారు ఏప్రిల్ 8న ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారు. కాగా తాజాగా ప్రభుత్వం అందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రిప్లై ఇచ్చింది. ఈ విషయంలో ప్రభుత్వం నుండి రిప్లై కోసం వేచిచూడటం వల్లే ఇప్పటివరకు పదో తరగతి ఫలితాలు వెల్లడించేందుకు విద్యా శాఖ వేచిచూడాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఆ అడ్డంకి తొలగిపోయింది. దీంతో మరో రెండు లేదా మూడు రోజుల్లో తెలంగాణ ఎస్ఎస్‌సి రిజల్ట్స్ డిక్లేర్ చేసే అవకాశం ఉంది.
అంతేకాకుండా ఇప్పటివరకు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ హోదాలో ఉన్న ఈ.వి. నరసింహా రెడ్డి ఇటీవలే ట్రాన్స్‌ఫర్ అయ్యారు. ఆ స్థానంలో ప్రభుత్వం ఇంకా కొత్త డైరెక్టర్‌ను అపాయింట్ చేయలేదు. దీంతో ఆ విభాగానికి అసలు డైరెక్టరే లేకుండా ఫలితాలు ఎలా వెల్లడిస్తారు అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. పాఠశాల విద్యా శాఖ కూడా ఇదే విషయమై ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.
ఒకవేళ డైరెక్టర్‌ను అపాయింట్ చేశాకే ఫలితాలు విడుదల చేయాలి అనుకున్నట్లయితే, పదో తరగతి ఫలితాలు మరో రెండు రోజులు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఫలితాల విడుదల తేదీపై మరో రెండు రోజుల్లో స్పష్టత రానుంది.