చింత చచ్చినా పులుపు చావలే... వరంగల్ సభలో కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రుల కౌంటర్స్

Telangana Ministers reacts to KCR speech: ఒకప్పుడు ధనిక రాష్ట్రమైన తెలంగాణ ప్రస్తుతం సుమారు 8 లక్షల 19 వేల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నప్పటికీ అభివృద్ధిని, సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రి వరంగల్ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన విమర్శలకు మంత్రులు పొంగులేటి, జూపల్లి కృష్ణా రావు, సీతక్క, పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ విలన్ అని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మరి తెలంగాణ ఇచ్చినందుకే కాంగ్రెస్ పార్టీని విలన్ అన్నారా అనే ప్రశ్నకు కేసీఆర్ సమాధానం చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చినప్పుడు మీ కుటుంబం మొత్తం వెళ్లి ఆనాటి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీకి సాస్టంగ నమస్కారం పెట్టుకుంది మీరు కాదా అని పొంగులేటి ప్రశ్నించారు. మరి ఇవాళ ఉన్నట్లుండి కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు విలన్ అని వ్యాఖ్యానించడం వెనుక అర్థం ఏముందని అన్నారు. కేసీఆర్ మాటలు వింటుంటే బాదేసిందని మంత్రి పొంగులేటి ఆవేదన వ్యక్తంచేశారు.
మరో మంత్రి జూపల్లి కృష్ణా రావు మాట్లాడుతూ కేసీఆర్ నియంతృత్వ వైఖరి ఇంకా పోలేదన్నారు. కేసీఆర్ తీరు చూస్తోంటే చింత చచ్చినా పులుపు చావలేదన్న చందంగా ఉందన్నారు. తెలంగాణ కోసం చందాలు వసూలు చేసి మరీ పాటుపడిన పార్టీ నిజంగానే అంత పారదర్శకంగా పనిచేస్తే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో అన్ని కోట్ల డబ్బులు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. వరంగల్ సభ కోసం ఊరూరా కనీసం రూ.3 , 4 లక్షలు ఖర్చుపెట్టి మరీ సభ నిర్వహించారు. అన్ని డబ్బులు ఎలా వచ్చాయని బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని నిలదీశారు.
మీ హయాంలో ఇరిగేషన్ అధికారిగా పనిచేసిన వ్యక్తి ఇంట్లో ఏసీబీ సోదాలు జరిపితే రూ. 100 కోట్లపైనే బయటపడింది. ఈ లెక్కన చూస్తే మరి మీరు ఇంకెన్ని వేల కోట్లు వెనకేసి ఉంటారని మంత్రి జూపల్లి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇంజనీర్ ఆయనే, కాంట్రాక్టర్ ఆయనే అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీవైపు ఒక వేలు చూపిస్తే మీవైపు నాలుగు వేళ్లు చూపిస్తున్నాయనే విషయం మర్చిపోవద్దు అని మంత్రి జూపల్లి అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ పాలనను చూసి బాధపడుతున్నానని కేసీఆర్ అన్న మాటలకు మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ బాధంతా అధికారం పోయిందనే తప్ప మరొకటి కాదన్నారు. అధికారం పోయిన తరువాత మీ ఇంట్లో అనేక చీలికలు, పేలికలు, ఆస్తుల పంచాయతులు అవుతున్నాయి. ఆ గొడవలతో బజారున పడుతున్నామనే బాధ తప్ప ఇంకేమీ లేదని సీతక్క అన్నారు.