
Saleshwaram: దక్షిణాది అమర్ నాథ్ యాత్రగా పేరుగాంచిన సలేశ్వరం లింగమయ్య జాతర షురూ అయ్యింది. శుక్రవారం ప్రారంభమైన జాతర మూడు రోజులు పాటు సాగుతుంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 5గంటల వరకు ప్రవేశానికి అనుమతి ఇస్తారు. ఇక్కడ చెంచులే పూజారులుగా వ్యవహరిస్తారు. ఎత్తైన కొండలు, దట్టమైన అడవి మీదుగా లోతట్టు ప్రాంతంలో జలపాతాన్ని దాటుకుంటూ, రాళ్లు, రెప్పలను కూడా లెక్కచేయకుండా దాదాపు 4కిలోమీటర్ల మేర నడక మార్గాన్ని వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. అందుకే దీనిని సాహసోపేత యాత్రగా చెబుతుంటారు.
సలేశ్వరం జాతర ఈనెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మూడు రోజులపాటు ఘనంగా సాగుతుంది. ఉగాది తర్వాత వచ్చే తొలి పౌర్ణమికి జాతర షురూ అవుతుంది. సలేశ్వరం లింగమయ్యను దర్శనం చేసుకునేందుకు ఉమ్మడి జిల్లాలతోపాటు తెలంగాణ, ఏపీ, కర్నాటక, తమిళనాడు నుంచి భక్తులు లక్షలాదిగా అక్కడికి తరలివస్తుంటారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5గంటల వరకు భక్తులకు అడవిలోకి అనుమతి ఇస్తారు. ఉత్సవాలకు సంబంధించి అధికారులు తగిన ఏర్పాటు చేస్తున్నారు. దారిపొడవునా భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.
ఇక శ్రీశైలం-హైదరాబాద్ రహదారిలో ఫరహాబాద్ పులిబొమ్మ నుంచి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. 35కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో సలేశ్వర క్షేత్రం ఉంటుంది. 10 కిలోమీటర్ల దూరంగా వెళ్లగానే రోడ్డుపక్కన నిజాం కాలం నాటి పురాతన కట్టడాలు ఉంటాయి. సలేశ్వరంకు నాగర్ కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి డీపోల నుంచి ప్రత్యేక బస్సులను అధికారులు నడిపిస్తున్నారు. అచ్చంపేట నుంచి మొదటి బస్సు ఉదయం 6గంటలకు బయలు దేరుతుంది. చివరి బస్సు సాయంత్రం 4 గంటలకు ఉంటుంది. అప్పాపూర్ పెంటకు చేరుకుని బస్సులో చేరుకుని అక్కడి నుంచి ఆటోల్లో సలేశ్వరం చేరుకోవచ్చు.