ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తెలంగాణ ప్రభుత్వం చేయబోయే అప్పులు ఎంతో తెలుసా?

ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తెలంగాణ ప్రభుత్వం చేయబోయే అప్పులు ఎంతో తెలుసా?
RBI reveals Telangana govt borrowing requests details: దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు తమకు భవిష్యత్‌లో రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించేందుకు అవసరమయ్యే రుణాల వివరాలను ముందుగానే భారతీయ రిజర్వ్ బ్యాంకుకు ( రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ) సమర్పిస్తుంటాయి. దానినే ఇండికేటివ్ క్యాలెండర్ ఆఫ్ మార్కెట్ బారోయింగ్స్ అని అంటుంటారు. ఆర్బీఐ నిర్వహణలో పారదర్శకతను చాటుకోవడం కోసం ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడిస్తుంటుంది.
అందులో భాగంగానే తాజాగా ఆర్బీఐ ఆ ఇండికేటివ్ క్యాలెండర్ వివరాలను రిలీజ్ చేసింది. ఆర్బీఐ వెల్లడించిన వివరాల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ నెలలో రూ. 4000 కోట్లు అప్పు కావాలని అర్జీ పెట్టుకుంది. అలాగే, మే నెలలో రూ. 5,000 కోట్లు, జూన్ నెలలో మరో రూ. 5000 కోట్ల అప్పు అవసరం ఉందని తెలంగాణ సర్కారు ఆర్బీఐని కోరింది. మొత్తంగా ఈ ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో తెలంగాణ ప్రభుత్వం రూ. 14,000 కోట్లు అప్పు తీసుకోనుంది.
ఏప్రిల్ నెలలో అప్పుగా కోరుతున్న రూ. 4000 కోట్లను రెండు విడతల్లో ఇవ్వాల్సిందిగా తెలంగాణ సర్కారు కోరింది. అందులో భాగంగానే ఏప్రిల్ 15న తొలి విడత రుణం తీసుకోనున్నట్లు స్పష్టంచేసింది. కానీ అంతకంటే ముందే ఏప్రిల్ 8నే తొలి విడత రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ బడ్జెట్ 2025-26 గణాంకాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 64,539 కోట్లు రుణం అవసరం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందులో భాగంగానే తొలి త్రైమాసికంలో రూ. 14,000 కోట్ల రుణం కోసం ప్రయత్నిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న రుణాలపై అసలు, వడ్డీల చెల్లింపుల కోసం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ. 30,847.37 కోట్లు కేటాయించింది.
ఇక ఆంధ్రప్రదేశ్ కూడా ఏప్రిల్ నెలలో రూ. 5000 కోట్లు అప్పు కావాలని, అది కూడా ఒకే విడతలో రుణం మంజూరు చేయాల్సిందిగా ఆర్బీఐని కోరింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం అంత పెద్ద మొత్తాన్ని ఒకే విడతలో రుణంగా పొందడం కూడా అరుదుగా జరుగుతుందని తెలుస్తోంది.