అన్నను ఎవరో చంపారని పోలీసులకు ఫిర్యాదు చేసిన తమ్ముడు.. విచారణలో దిమ్మదిరిగే ట్విస్ట్..!
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కార్ల్ మార్క్స్ ఎప్పుడో చెప్పారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతోన్న సంఘటనలు చూస్తుంటే ఇది అక్షర సత్యమని అనిపిస్తోంది.

అన్నను ఎవరో చంపారని పోలీసులకు ఫిర్యాదు చేసిన తమ్ముడు.. విచారణలో దిమ్మదిరిగే ట్విస్ట్..!
Man Kills Elder Brother Over Money
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కార్ల్ మార్క్స్ ఎప్పుడో చెప్పారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతోన్న సంఘటనలు చూస్తుంటే ఇది అక్షర సత్యమని అనిపిస్తోంది. డబ్బుల కక్కుర్తికోసం సొంత కుటుంబ సభ్యులనే హతమారుస్తున్నారు కొందరు. తాజాగా ములుగు జిల్లాలో జరిగి ఓ దారుణ సంఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.
వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం అనే గ్రామానికి చెందిన విజయ్ బాబు అనే గిరిజనుడు ఏప్రిల్ 9వ తేదీన దారుణ హత్యకు గురయ్యాడు. తన అన్నను రాత్రి ఎవరో కొందరు వ్యక్తులు ముసుగులు ధరించి వచ్చి రాడ్డుతో కొట్టి హతమార్చారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు తమ్ముడు బుల్లబ్బాయి.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ముసుగు ధరించిన వ్యక్తులు ఎవరన్నా కోణంలో విచారణ ప్రారంభించారు. అయితే తమ్ముడు బుల్లబ్బాయి వ్యవహారతీరులో తేడా అనిపించడంతో కాస్త గట్టిగా ప్రశ్నించారు. దీంతో మనోడు అసలు విషయం చెప్పేశాడు. తన అన్నను తానే చంపేశానని చెప్పుకొచ్చాడు. దీంతో పోలీసులు నివ్వెరపోయారు.
సొంత తమ్ముడే అతన్ని కొట్టి చంపి హైడ్రామా క్రియేట్ చేశాడని గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి పూర్తిస్థాయి విచారణ చేస్తున్నారు. అయితే ఇద్దరు తమ్ముళ్ల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన విజయ్ బాబు అదే తమ్ముడు చేతిలో హత్యకు గురవడం అందరినీ కలిచి వేసింది. తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో తన తమ్ముళ్లు బుల్లబ్బాయి, రాజేంద్రప్రసాద్‌ల బాధ్యతను చూసుకుంటున్నాడు విజయ్ బాబు.
ఈ క్రమంలోనే మద్యానికి బానిసగా మారిన బుల్లబ్బాయి తాగడానికి నిత్యం డబ్బులు అడుగుతుండే వాడు. ఈ క్రమంలోనే బుధవారం(ఏప్రిల్ 9) రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న క్రమంలో తనకు డబ్బులు కావాలని అన్న విజయబాబును డిమాండ్ చేశాడు. కానీ డబ్బులు లేవని గట్టిగా మందలించడంతో నిద్రమత్తులో ఉన్న అన్నను అతి దారుణంగా ఇనుపరాడ్డుతో కొట్టి చంపినట్లుగా పోలీసులు గుర్తించారు.