Telangana Weather Report: తెలంగాణకు వర్ష సూచన.. వరి కోతకు వచ్చిన రైతులకు టెన్షన్
Telangana Weather Forecast: తెలంగాణలో గురువారం అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు 30 - 40 కిమీ వేగంతో...
Telangana Weather Report: తెలంగాణకు వర్ష సూచన.. వరి కోతకు వచ్చిన రైతులకు టెన్షన్
Telangana Weather Forecast: తెలంగాణలో గురువారం తేలికపాటి నుండి ఓ మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు 30 - 40 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, సూర్యాపేట, జనగాం, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఈదురు గాలులతో వర్షాలు, పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
హైదరాబాద్‌లో గత రెండు, మూడు రోజులుగా అక్కడక్కడా చెదురుముదురు జల్లులు కురుస్తున్నాయి. నగరంలో గురువారం నాడు కనీస ఉష్ణోగ్రతలు 23 డిగ్రీల సెల్సియస్, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ నివేదిక స్పష్టంచేసింది.
ఇక రైతుల విషయానికొస్తే, ఈసారి వర్షాలు సమృద్ధిగా లేకపోవడంతో భూగర్భజలాలు భారీగా తగ్గిపోయాయి. ఫలితంగా రిజర్వాయర్లు, కాలువల ఆయకట్టు పొలాలకు తప్పించి అనేక ప్రాంతాల్లో నీరు లేక పొలాలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. అంతో ఇంతో కష్టపడి నీరు కట్టి బతికించుకున్న పొలాలు కూడా ఇప్పుడు కోతకు సిద్ధంగా ఉన్నాయి.
ఇప్పటికే చివరిసారి కురిసిన వడగండ్ల వానకు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగింది. ముఖ్యంగా నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాల్లో వడగండ్ల వాన రైతులకు కన్నీరే మిగుల్చింది. దీంతో ప్రస్తుతం తడి ఆపి కోతకు సిద్ధంగా ఉన్న పొలాల రైతులు కూడా ఈ అకాల వర్షాలు ఏం చేస్తాయోననే భయం వెంటాడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ముందే వరి నాట్లు వేసిన రైతులు ఇప్పటికే వరి కోసి ధాన్యాన్ని మార్కెట్‌కు తరలించే ప్రయత్నాల్లో ఉన్నారు. వారిని కూడా ఈ అకాల వర్షాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.
పంట ఎదగక ముందే వరికోసే రైతులు, హార్వెస్టర్ల యజమానులపై కేసులు
ఇదిలావుంటే, పంట పూర్తిగా ఎదగక ముందే వరి కోసే రైతులు, హార్వెస్టర్ల యజమానులపై నిఘా పెట్టాల్సిందిగా ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. వర్షాలు కురుస్తాయనే భయంతోనో లేక హార్వెస్టర్ల కొరత ఏర్పడుతుందనే భయం వల్లో పంట చేతికొచ్చే సమయాని కంటే ముందే వరి కోసే రైతులు, హార్వెస్టర్ల యజమానులరైపై కేసులు నమోదు చేయాల్సిందిగా ప్రభుత్వం అధికారులకు సూచించింది.
పంట ఎండక ముందే పచ్చిగా ఉన్నప్పుడే కోయడం వల్ల మాయిశ్చర్ రావడానికి చాలా సమయం పడుతోంది. మాయిశ్చర్ రాని ధాన్యం నిల్వ ఉండకుండా పాడయ్యే ప్రమాదం ఉంది. అలాగని మాయిశ్చర్ వచ్చేంత వరకు వేచిచూసే క్రమంలో ఆలోగా వర్షాలు పడి ధాన్యం నీటి పాలయితే ప్రభుత్వం సకాలంలో కొనకపోవడం వల్లే ధాన్యం నీటిపాలైందనే ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తోందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.