Telangana: తెలంగాణ రైతులకు సర్కార్ గుడ్ న్యూస్.. వ్యవసాయశాఖ మంత్రి కీలక ప్రకటన
Farmers
Telangana: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు . ఆయిల్ ఫామ్ రైతులకు శుభవార్త వినిపించారు. ఆయిల్ ఫామ్ గింజల ధర టన్నుకు రూ. 21,000 కి చేరిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ధర రూ. 8,500 మేర పెరిగిందని ఏప్రిల్ 1,2025 విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ పెరుగుదలతో రాష్ట్రంలోని ఆయిల్ ఫామ్ రైతులకు అదనపు లాభం చేకూరుతుందనీ వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు రైతు భరోసా, రుణమాఫీ వంటి స్కీములతో పాటు పంట మార్పిడి ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వివరించారు.
రాష్ట్రంలో 31 జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగను విస్తరించేందుకు 10కంపెనీలకు అనుమతులు ఇచ్చామనీ..ఇప్పటి వరకు 40 లక్షల ఎకరాల్లో సాగు ప్రారంభం అయ్యిందని తెలిపారు. అంతేకాదు 4,345 మంది రైతుల ఖాతాల్లో రూ. 72కోట్లు జమ చేసినట్లు ప్రకటించారు. తద్వారా ఆయిల్ పామ్ రైతులను అన్నిరకాలుగా ఆదుకుంటున్నామని మంత్రి తెలిపారు.
గత ఆరు నెలల్లో అంతర్జాతీయ మార్కెట్లో ముడి పామాయిల్ ధరలు $980-$1,000 నుంచి $1,145కి పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి. ఇక్కడ సెప్టెంబర్ 2024లో కేంద్రం ముడి పామాయిల్ దిగుమతి సుంకాన్ని 5.5% నుంచి 27.5%కి పెంచడం కూడా ధరల పెరుగుదలకు కారణం అయ్యింది. ఖమ్మం జిల్లాలోని కొందరు రైతులు గతంలో టన్నుకు రూ.13,000 వచ్చేదనీ, ఇప్పుడు రూ.21,000కి పెరిగినా ఇది ఇంకా లాభదాయకం కాదని అంటున్నారు.