Revanth Reddy: రాష్ట్రవ్యాప్తంగా 7వేలకుపైగా వరి కొనుగోలు కేంద్రాలు

Revanth Reddy: ఈ సీజన్ నుంచే సన్నాలకు రూ. 500 బోనస్

Update: 2024-10-03 14:22 GMT

Revanth Reddy: రాష్ట్రవ్యాప్తంగా 7వేలకుపైగా వరి కొనుగోలు కేంద్రాలు

Revanth Reddy: ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు రాష్ట్రవ్యాప్తంగా 7వేలకుపైగా కేంద్రాలు నెలకొల్పినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇంకా ఎక్కడైనా కొనుగోలు కేంద్రాలు అవసరమని కలెక్టర్లు భావిస్తే అక్కడ కొత్త కేంద్రాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఐకేపీ సెంటర్ల ఏర్పాటు, డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్, అపాయింట్​మెంట్​ఆర్డర్ల ప్రక్రియపై జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్​నిర్వహించారు.

రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్ నుంచే సన్నాలకు 500 బోనస్ చెల్లిస్తుందని స్పష్టం చేశారు. గత సీజన్ లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు మూడు రోజుల్లో డబ్బులు ఇచ్చామని, ఈసారి 48 గంటల్లోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు రేవంత్. రాష్ట్రంలో ఈ వానాకాలంలో 66.73 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారని,, గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 140 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసిందని సీఎం చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా కట్టడి చేయాలని పోలీస్ అధికారులను అప్రమత్తం చేశారు ముఖ్యమంత్రి.

అన్ని మార్గాల్లోనూ పకడ్బందీగా నిఘా ఉంచాలని, చెక్ పోస్టుల వద్ద నిరంతర పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. తాలు, తరుగు, తేమ పేరుతో రైతులను మోసం చేసే వారిని సహించవద్దని, అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పారు. రైతులు ఎక్కడ కూడా దోపిడీకి గురి కాకూడదని, రైతుల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును కలెక్టర్లు బాధ్యతగా స్వీకరించాలని కోరారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో సరిపడే సంఖ్యలో గోనె సంచులు, టార్ఫాలిన్లు, మాయిశ్చర్ మిషన్లు, డ్రైయర్లు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు సీఎం రేవంత్.

ఇక అన్ని జిల్లాల్లో డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన 5తారీఖు లోపు పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తం 11వేల 62 మంది ఎంపికైన అభ్యర్థులకు దసరా పండుగలోపు నియామక పత్రాలను అందిస్తామని ప్రకటించారు. అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందించేందుకు వీలుగా జిల్లాల్లో వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.

Tags:    

Similar News