ఎన్నికలు సజావుగా సాగేందుకు ఏర్పాట్లు పూర్తి : నాగిరెడ్డి

Update: 2019-12-24 09:35 GMT
కమిషనర్‌ నాగిరెడ్డి

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మున్సిపల్‌ ఎన్నికలకు నగారా మోగింది. దీంతో ఎన్నికల సంఘం ఎలక్షన్ల ఏర్పాట్లను చేపట్టింది. ఈ నేపధ‌్యంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కమిషనర్‌ నాగిరెడ్డి మున్సిపల్‌ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మాసబ్‌ ట్యాంక్‌లోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. అభ్యర్థుల వ్యయాన్ని మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్ తరువాత పరిగణిస్తామని తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితాను తయారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఎన్నికల్లో 1-1- 2019 ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.

ఎన్నికల నేపథ్యంలో ఈనెల 27న కలెక్టర్లు, 28న రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నట్లు ఆయన తెలిపారు. దాంతో పాటు అధికారులు ఎవరూ కూడా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని సూచించారు. పెద్ద పెద్ద బ్యానర్లను ప్రభుత్వ పార్టీ తరుఫున పెట్టవద్దని తెలిపారు. ఎన్నికల గురించి ప్రచారం చేయడం కానీ, రాజకీయ పార్టీల సమావేశాలు కానీ నిర్వహించకూడదన్నారు. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల్లో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించ కూడదన్నారు. ఎవరైనా కోడ్ ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

ఇక అభ్యర్థులు ఎన్నికల సమయంలో చేయవలసిన డిపాజిట్ గతంలో ఉన్న విధంగానే ఉంటుందని స్పష్టం చేశారు. ఇదే నేపథ‌్యంలో పోలింగ్ స్టేషనుకు 800 మంది ఓటర్లు ఉంటారని తెలిపారు. బ్యాలెట్ బాక్సులను పోలింగ్‌ కోసం సిద్ధంగా ఉంచామని తెలిపారు. ఈమేరకు అధికారులకు శిక్షణ కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు అన్ని విధాల ఏర్పాట్లు పూర్తి చేసామని భద్రత ఏర్పాట్లను కూడా చేసామని నాగిరెడ్డి వెల్లడించారు.




Tags:    

Similar News