Mohammad Azharuddin: ఈడి విచారణకు మొహమ్మద్ అజారుద్దీన్ డుమ్మా

Update: 2024-10-03 15:20 GMT

Mohammad Azharuddin: టీమిండియా మాజీ కెప్టేన్, కాంగ్రెస్ నేత మొహమ్మద్ అజారుద్దీన్ ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు డుమ్మాకొట్టారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో రూ. 20 కోట్ల మేర అవినీతి జరిగినట్లు ఆరోపణలు రావడంతో మనీ లాండరింగ్ చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ చేపట్టింది. అందులో భాగంగానే మొహమ్మద్ అజారుద్దీన్ వాంగ్మూలం నమోదు చేసుకునేందుకు ఇవాళ ఆయన హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీసుకు రావాల్సిందిగా సమన్లు జారీచేసింది. అయితే, ఇవాళ ఆ విచారణకు హాజరుకాని అజారుద్దీన్.. తనకు మరింత సమయం కావాలని కోరారు. దీంతో అక్టోబర్ 8న విచారణకు రావాల్సిందిగా ఈడీ మరోసారి అజారుద్దీన్‌కి సమన్లు జారీచేసింది.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో అవినీతి ఆరోపణలపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు గతంలోనే మూడు ఎఫ్ఐఆర్‌లు, చార్జ్‌షీట్స్ నమోదు చేశారు. అందులో ఒక ఫిర్యాదు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సీఈఓ సునిల్ కంటే ఇచ్చిన ఫిర్యాదు కూడా ఉంది. మధ్యంతర ఫోరెన్సిక్ ఆడిటింగ్‌లో అక్రమ లావాదేవీలు, అవకతవకలు బయటపడినట్లుగా తేలిన తరువాత సునిల్ ఈ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులపై నమోదైన ఎఫ్ఐఆర్స్, చార్జ్‌షీట్స్ ఆధారంగానే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సైతం విచారణ చేపట్టింది. అందులో భాగంగానే గతేడాది నవంబర్‌లోనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కి సంబంధించి మాజీ ఉపాధ్యక్షుడు, ఇండియన్ క్రికెటర్ అయిన శివలాల్ యాదవ్, మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వినోద్, మాజీ సెక్రటరీ అర్షద్ ఆయుబ్, ఎస్ఎస్ కన్సల్టెంట్స్ ఆఫీసుతో పాటు ఆ సంస్థ ఎండీ సత్యనారాయణ నివాసాలలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనిఖీలు చేపట్టారు.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పరిధిలో నిర్వహిస్తోన్న ఉప్పల్ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో డీజిల్ విద్యుత్ జనరేటర్స్ కొనుగోలు, పై కప్పు నిర్మాణం, అగ్నిమాపక యంత్రాల కొనుగోళ్లు వంటి వ్యవహారాల్లో భారీ మొత్తంలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు చార్జ్ షీట్స్ చెబుతున్నాయి. త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. స్టేడియం అభివృద్ధి పనుల్లో జాప్యం జరగడం, ఫలితంగా అభివృద్ధి వ్యయం పెరిగి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కి ఖర్చు తడిసిమోపెడవడం వంటి అంశాలు ఈ చార్జ్ షీట్స్‌లో ఉన్నాయి.

ఎలాంటి కొటేషన్స్ తీసుకోకుండానే అప్పటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పెద్దలు తమకు నచ్చిన వారికి టెండర్స్ అప్పగించి సంస్థకు నష్టం వాటిల్లిందుకు కారకులయ్యారనే అభియోగాలున్నాయి. ఈ క్రమంలోనే అప్పట్లో హెచ్‌సిఏ అధ్యక్షుడిగా ఉన్న మొహమ్మద్ అజారుద్దీన్ కూడా ఈ వివాదంలో పాత్ర ఉన్నట్లుగా ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. అందులో భాగంగానే ఆయన నేడు ఈడి ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ.. ఇంకొంత సమయం కావాలని కోరుతూ ఆయన ఆ విచారణకు డుమ్మాకొట్టారు. 

Tags:    

Similar News