Konda Surekha: 'సమంత, నాగ చైతన్యల విడాకులకు కేటీఆరే కారణం... ఓపెన్‌గా చెబుతున్నా'
Konda Surekha: సినీ నటులు నాగచైతన్య, సమంత విడాకులకు బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ కారణమని తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Konda Surekha: సినీ నటులు నాగచైతన్య, సమంత విడాకులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణమని తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారని ఆమె ఆరోపించారు. హీరోయిన్లకు మత్తు పదార్ధాలు అలవాటు చేసింది ఆయనేనని చెప్పారు. బుధవారం ఆమె హైద్రాబాద్ గాంధీ భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు.చాలా మంది జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారని ఆరోపించారు. కొందరు సినీ పరిశ్రమకు దూరం కావడానికి కూడా ఆయనే కారణమన్నారు.
మహిళలంటే కేటీఆర్ కు చిన్నచూపు అని ఆయన చెప్పారు. మొన్న సీతక్క, ఇవాళ తనను ట్రోల్ చేస్తున్నారన్నారు. మహిళా మంత్రిని అవహేళనగా ట్రోల్ చేస్తే ఖండించే సంస్కారం కేటీఆర్ కు లేదా అని ఆమె ప్రశ్నించారు. దుబాయ్ నుంచి సోషల్ మీడియాను ఆపరేట్ చేస్తోందన్నారు. నా మీద ట్రోలింగ్ కు సంబంధించి మనసున్న మనిషిగా హరీష్ రావు స్పందించారని ..కానీ, కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదని ఆమె ప్రశ్నించారు. దొంగ ఏడుపులు ఏడ్వాల్సిన అవసరం తనకు లేదని ఆమె తెలిపారు.
కొండా సురేఖవి దొంగ ఏడుపులు:కేటీఆర్
సోషల్ మీడియాలో తమపై గతంలో ట్రోలింగ్ జరిగిన సమయంలో మా ఇంట్లో మహిళలు బాధ పడలేదా అని కేటీఆర్ కొండా సురేఖను ప్రశ్నించారు. మంత్రి సురేఖ మీడియా సమావేశానికి ముందుగానే బుధవారం మధ్యాహ్నం బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ అంటూ సురేఖ దొంగ ఏడుపులు, పెడబొబ్బలు పెడుతుందన్నారు.
కొండా సురేఖను వ్యక్తిగతంగా ఏమీ అనలేదని మాజీ మంత్రి స్పష్టం చేశారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని తనపై కోండా సురేఖ తప్పుడు ఆరోపణలు చేశారని ఆయన గుర్తు చేశారు.నాకు కుటుంబం,, భార్యాపిల్లలు లేరా..అని ఆయన ప్రశ్నించారు. సురేఖపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు
వరద బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి సహాయం కూడా చేయలేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలకు దిక్కు లేదని ఆయన విమర్శించారు. అక్రమ నిర్మాణాల్లో కూల్చాల్సి వస్తే తొలుత బుద్దభవన్ ను ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఆఫీస్ ను కూల్చాలన్నారు. . రేవంత్ నోరును సీతక్క, సురేఖ ఫినాయిల్ తో కడగాలని ఆయన సూచించారు. . సోషల్ మీడియాలో కేసీఆర్ ను తిట్టిపోయలేదా అని ఆయన ప్రశ్నించారు. మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకనే కాంగ్రెస్ దాడులు చేస్తోందని ఆయన విమర్శించారు.
అసలు ఏం జరిగిందంటే?
ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జీ మంత్రిగా కొండా సురేఖ ఇటీవల దుబ్బాకలో కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె ఈ కార్యక్రమానికి రావడాన్ని స్వాగతిస్తూ మెదక్ ఎంపీ రఘునందన్ రావు నూలు దండను మెడలో వేశారు. ఈ ఫోటోపై సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఈ ట్రోల్స్ పై మంత్రి కొండా సురేఖ మనోవేదనకు గురయ్యారు. బీఆర్ఎస్ శ్రేణులే ఇలా తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. మీడియా సమావేశంలోనే కన్నీరు పెట్టుకున్నారు. దీని వెనుక కేటీఆర్ ఉన్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ చేస్తున్న ఫోటోలను మీ ఇంట్లో మహిళలకు చూపితే సమర్ధిస్తారా లేదా చెప్పాలన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ విషయమై తనకు ఫోన్ చేసి రఘునందన్ రావు కూడా క్షమాపణలు చెప్పారని ఆమె తెలిపారు.
రఘునందన్ రావు రియాక్షన్ ఇదీ...
మంత్రి సురేఖకు తాను నూలుదండ వేయడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ పై మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. అక్కకి, చెల్లికి, తల్లికి ఉన్న వ్యత్యాసాన్ని గమనించని సంస్కారహీనస్థితిలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఉందని ఆయన విమర్శించారు. దుబ్బాకలోని చేనేత కార్మికుల సమస్యలను మంత్రి సురేఖ దృష్టికి తెచ్చేందుకు తాను అక్కా.. దండ వేయవచ్చా అని అడిగి ఆ ఇంట్లో పుట్టిన బిడ్డగా నేతన్నల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అక్కకు తమ్ముడిగా ఆమె మెడలో దండవేశానని ఆయన వివరించారు. అయితే దీన్ని కొందరు సంస్కారహీనులు వక్రీకరిస్తూ పోస్టులు పెట్టడం బాధాకరమని ఆయన మండిపడ్డారు. అక్కకు జరిగిన అన్యాయానికి తమ్ముడిగా తాను అండగా ఉంటానని ఆయన చెప్పారు.