ఆదివాసీ బాధిత మహిళను పరామర్శించిన మంత్రి జూపల్లి.. అండగా ఉంటానని భరోసా..
Nagarkurnool: ఆటవికం..అమానుషం..సభ్య సమాజం తలదించుకునే ఘటన. అవును.. కూలి పనికి రాలేదని..చెంచు మహిళపై పాషవికంగా దాడి చేశారు.
Nagarkurnool: ఆటవికం..అమానుషం..సభ్య సమాజం తలదించుకునే ఘటన. అవును.. కూలి పనికి రాలేదని..చెంచు మహిళపై పాషవికంగా దాడి చేశారు. మర్మంగాలపై కారం చల్లి, డీజీల్ పోసి నిప్పంటించారు. ఈ దారుణ ఘటన నాగర్ కర్నూలు జిల్లా మొల్ల చింతపల్లిలో జరిగింది. ఓ చెంచు కుటుంబం తన వద్దకు పనికి రావడం లేదన్న అక్కసుతో ఓ ఇసుక వ్యాపారి ఈ దారుణానికి ఒడిగట్టాడు. కొన్ని రోజులపాటు ఇంట్లోనే నిర్బంధించి పాశవికంగా ఆ మహిళపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆ బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బాధిత మహిళను జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇసుక వ్యాపారి దాడిలో గాయపడిన బాధిత మహిళను మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు. 2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించి బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మహిళలపై దాడులను ఉపేక్షించే ప్రసక్తే లేదని నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి జూపల్లి.
ఆదివాసి మహిళను దారుణంగా హింసించిన దుండగులను కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత ఆదివాసి మహిళను వారు పరామర్శించారు. లక్షా 50 వేల రూపాయల నగదును తక్షణ ఆర్థిక సహాయంగా అందించి బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సభ్య సమాజం సిగ్గుపడేలా ఇంతటి దారుణానికి ఒడిగట్టిన దుండగులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.