Badvel News: ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు

Update: 2024-10-19 16:27 GMT

Jilted Lover Attacks Girl Student: కడప జిల్లా బద్వేల్ సమీపంలో ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన కలకలం రేపింది. 80 శాతం కాలిన గాయాలతో ఆమె కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి నుంచి జిల్లా జడ్జి వాంగూల్మం తీసుకున్నారు.

విద్యార్థినిని పిలిచి హత్యాయత్నం

కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని రామాంజనేయనగర్‌కు చెందిన విద్యార్ధిని స్థానిక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. అదే కాలనీకి చెందిన విఘ్నేష్ ఆమెను 8వ తరగతి నుంచి ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు. ఇటీవలే విఘ్నేష్‌కు పెళ్లైంది. అయినా కూడా ఆ విద్యార్ధిపై వేధింపులు ఆపలేదు. శనివారం తనను కలవాలని విద్యార్థినికి విఘ్నేష్ ఫోన్ చేశారు. కలవకపోతే చనిపోతానని ఆమెను బెదిరించారు. యువకుడి బెదిరింపులకు భయపడిన ఆ యువతి అతడు చెప్పిన చోటుకు వెళ్లారు. ఇద్దరూ కలిసి పీపీకుంట చెక్ పోస్టు సమీపంలోని ముళ్లపొదల్లోకి వెళ్లారు. అక్కడే విఘ్నేష్ ఆ యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుండి పరారయ్యాడని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ చెప్పారు.

నిందితుడిని అరెస్ట్ చేయాలని చంద్రబాబు ఆదేశం

ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడి ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. అధికారులతో ఆయన మాట్లాడారు. బాధితురాలి ఆరోగ్యం గురించి ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. నిందితుడిని అరెస్ట్ చేయాలని ఆయన పోలీసులను కోరారు.

నిందితుడి కోసం రంగంలోకి 4 బృందాలు

ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడి ఘటనను కడప పోలీసులు తీవ్రంగా పరిగణించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్పందించడంతో ఈ కేసు తీవ్రత మరింత పెరిగింది. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు జిల్లా ఎస్పీ నాలుగు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుడి ఆచూకీ కోసం ఆ నాలుగు బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ మీడియాకు వెల్లడించారు.  

Tags:    

Similar News