హైదరాబాద్‌లో పండ్లు తింటున్నారా..? అవి స్వచ్ఛమైనవేనా..? అసలు ఏం జరుగుతుందంటే..

Hyderabad News: *రసాయనాలతో మగ్గిన పండ్లు ఆరోగ్యానికి ప్రమాదం *సాధారణ తనిఖీలతో చేతులు దులుపుకుంటున్న అధికారులు

Update: 2022-05-01 02:41 GMT

హైదరాబాద్‌లో పండ్లు తింటున్నారా..? అవి స్వచ్ఛమైనవేనా..? అసలు ఏం జరుగుతుందంటే..

Hyderabad News: ప్రకృతి మనకు అందించిన వరం ఫలాలు. ఆరోగ్యం కోసం ప్రతిరోజూ ఒక పండు తినాలని వైద్యులు సూచిస్తారు. ఇక సీజనల్ పండ్ల గురించి చెప్పనవసరమే లేదు.వేసవిలో మార్కెట్లో అందుబాటులో ఉండే పండ్లలో మామిడిది ప్రత్యేక స్థానం.మధుర ఫలం,అమృతఫలం గా పిలువబడే మామిడి అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న తొంభైశాతం పండ్లు రసాయనాలతో మగ్గపెట్టినవే. రసాయనాలతో కృత్రిమంగా మగ్గపెట్టిన ఈ పండ్లు తినటం ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక నగరంలోని ఫ్రూట్ మార్కెట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేసినప్పుడు చాలా చోట్ల ప్రమాదకర రసాయనాలతో మగ్గపెడ్తున్నట్లు తేలటం ఆందోళనకు గురి చేస్తుంది.

హైదరాబాద్ లో మార్కెట్లలో లభ్యమౌతోన్న పండ్లు మాత్రం యమ డేంజర్ గా ఉంటున్నాయి. సహజంగా పండే పండ్లు ఆరోగ్యానికి హాని కలిగించవు. కానీ ప్రమాదకర రసాయనాలతో మగ్గిన పండ్లు ఆరోగ్యానికి చాలా ప్రమాదం. సరిగ్గా ఇప్పుడు హైదరాబాద్ లో ఇదే జరుగుతోంది. ఏ ఫ్రూట్ మార్కెట్లో చూసినా ప్రమాదకర రసాయనాలతో పండ్లను మగ్గించటమే కనిపిస్తోంది.

ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కడ చూసినా బంగారం వర్ణంతో మెరిసిపోతున్న మామిడి పండ్లే దర్శనమిస్తున్నాయి. ఫ్రూట్ మార్కెట్లతోపాటు ,తోపుడు బండ్లు, లలో మామిడి పండ్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.మెరిసేదంతా బంగారం కాదన్నట్లు ఇప్పుడు మార్కెట్లో చూడగానే బంగారం వర్ణంతో కాంతులీనుతున్న మామిడి పండ్లు అంత మంచివి కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక సహజంగా పండే పండ్లు అలా బంగారు వర్ణంలో ఉండవని అలా కనిపిస్తున్నాయంటే అవి కచ్చితంగా రసాయనాలతో మగ్గపెట్టినవేనని వారు చెప్తున్నారు.

అయితే హెచ్ ఎం టీవి క్షేత్రస్థాయి పరిశీలనలో ఫ్రూట్ మార్కెట్లలో పండ్లను ప్రమాదకర రసాయనాలతో అదీ మోతాదుకు మించి రసాయనాలు వాడుతూ పండ్లను మగ్గపెడ్తున్నట్లు స్పష్టమయ్యింది. సహజంగా పక్వానికి వచ్చిన కాయ పండు అవ్వాలంటే.. గడ్డిలో మాగబెడితే వారం నుంచి 10 రోజులకు పండు అవుతుంది. కాని రసాయనాలు వేయడం వల్ల.. కొన్ని గంటల్లోనే పండుగా మారుతోంది. రవాణా చేయడానికి అనువుగా ప్లాస్టిక్‌ ట్రేలల్లో ఒక వరుస మామిడి కాయలు వాటిపై రసాయన పౌడర్‌ ప్యాకెట్లు రెండు పెట్టి పలు ప్రాంతాలతోపాటు ఇతర రాష్టాలకు యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు వ్యాపారులు. ఇలా మగ్గపెట్టిన పండ్లు కొన్ని గంటల్లోనే బంగారు వర్ణాన్ని సంతరించుకొని వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.

గతంలో వ్యాపారులు పండ్లను మాగపెట్టేందుకు కాల్షియం కార్బైడ్‌ ను వాడేవారు.కానీ ఇప్పుడు తమ పంథా మార్చిన వ్యాపారులు ..కాల్షియం కార్బైడ్ కు బదులు ఇతిఫామ్ ఫ్రూట్‌ రైపనర్‌ అనే రసాయనాలను వినియోగిస్తున్నారు. హెచ్ ఎం టీవి పండ్ల మార్కెట్లో జరుగుతోన్న తంతును ఎక్స్ క్లూజివ్ గా చిత్రీకరించింది. చాలా చోట్ల యదేచ్చగా పండ్లను కృత్రిమంగా మాగ పెడ్తున్నారు. ఐతే..అధికారులు మాత్రం అప్పుడప్పుడు సాధారణ తనిఖీలతో చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలున్నాయి.

చాలా వరకు వ్యాపారులు కాయలు పూర్తిగా దిగుబడి దశకు రాక ముందే రసాయనాలతో మగ్గించి మార్కెట్‌లోకి తీసుకు వస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు బాటా సింగారం పండ్ల మార్కెట్ పై దాడులు చేయగా మామిడి పండ్లను అక్కడ ఇతిఫామ్ అనే రసాయనంతో మగ్గపెడ్తున్నట్లు గుర్తించారు. అది కూడా మోతాదుకు మించి వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఫెస్టి సైడ్ గా ఉపయోగించే ఇతిఫామ్ ను ఇలా పండ్లను మగ్గ పెట్టేందుకు వాడటం ప్రమాదకరమని... ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మార్కెట్లో లభ్యమవుతున్న పండ్లను ఉప్పు వేసిన నీటితో బాగా శుభ్రం చేసుకున్న తరువాతే తినాలని వారు సూచిస్తున్నారు.

డిమాండ్ కు తగ్గట్లు పండ్లను అందించేందుకు కృత్రిమంగా మగ్గపెట్టడం కోసం ఇప్పుడు అనేక మార్గాలున్నాయి. తక్కువ మోతాదులో ప్రభుత్వం సూచించిన రసాయనాలతో మగ్గించటం శ్రేయస్కరమని నిపుణులు చెప్తున్నారు.

Tags:    

Similar News