ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ధరణి పోర్టల్ తెలంగాణ ముంగింట్లోకి వచ్చేసినట్లే.. నేటి నుంచి ధరణి పోర్టల్ అందరికీ అందుబాటులోకి రానుంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి తహసీల్దార్ ఆఫీస్‌లో నేడు మధ్యాహ్నాం సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. ఇక అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 570 మండలాల్లో సాగు భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు.
ధరణి పోర్టల్ ప్రారంభోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ధరణి పోర్టల్ నిర్వహణపై తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, ధరణి ఆపరేటర్లకు శిక్షణకూడా ఇచ్చారు. ధరణి పోర్టల్‌లో స్లాట్ బుకయ్యాక నిర్ధేశిత సమయానికి ఎమ్మార్వో ఆఫీస్‌కు వెళ్తే 10నిమిషాల్లో రిజిస్ట్రేషన్, ముటేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే భూ యజమాని ఫొటోతో సహా అన్ని వివరాలు ధరణిలో ప్రత్యక్షమయ్యేలా పోర్టల్‌ని డిజైన్ చేశారు.
ధరణి పోర్టల్ ప్రారంభమయ్యాక సీఎం కేసీఆర్ బహిరంగసభలో పాల్గొంటారు. సభలో 3వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ సిట్టింగ్ విధానాన్ని ఏర్పాటు చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మూడు చింతలపల్లి గ్రామానికి సీఎం కేసీఆర్ వస్తుండడంతో భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. బహిరంగ సభ ఏర్పాట్లు, ధరణి పోర్టల్ అంశాలను సోమేశ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. భద్రత పరమైన అంశాలను సైబరాబాద్ సీపీ సజ్జానర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సభా ప్రాంగణంలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
ధరణి పోర్టల్ కోసం కొద్ది రోజులుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా నిలిపివేశారు. దీంతో ధరణి పోర్టల్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ రిజిస్ట్రేషన్ విధానంపై ప్రజలకు సందేహాలు ఉన్నాయి. వాటిపై ప్రభుత్వ అధికారులే ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరముంది.